Abhishek Banerjee: ఇప్పుడే పీవోకేను స్వాధీనం చేసుకోవాలి: అభిషేక్ బెనర్జీ

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను (పీవోకే) పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం బెదిరింపులకు పరిమితం కాకుండా, చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాలని ‘ఎక్స్’ వేదికగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు ఆయన సలహా ఇచ్చారు. “పాకిస్థాన్‌పై కేవలం మెరుపు దాడులు చేయడమో, లేదంటే బెదిరించడమో కాదు.. ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఇది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం. ఆ దిశగా కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలి. స్వార్థపూరిత రాజకీయాలకు తావులేకుండా దేశం కోసం ఆలోచించాలి. ప్రస్తుతం ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిందే” అని అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) పేర్కొన్నారు.