WTC: డబ్ల్యూటీసీలో ఇండియా ఫైనల్ చేరాలంటే సమీకరణాలు ఇవే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో(BGT) భాగంగా పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్ ఇప్పుడు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (WTC) ఫైనల్ పై ఫోకస్ చేసింది. న్యూజిలాండ్ పై క్లీన్ స్వీప్ తర్వాత భారత్ కు ఆస్ట్రేలియాపై విజయం మంచి ఊరటను ఇచ్చింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకోగా, భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం, స్వదేశంలో శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో, ప్రోటీస్ ఆస్ట్రేలియాను అధిగమించి నంబర్ 2 స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఏ జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక తొలి రెండు స్థానాలకు పోటీలో ఉన్నాయి. పెర్త్ టెస్టులో విజయం భారత్కు నూతన ఉత్సాహం అందించినా… ఫైనల్ కు చేరాలంటే కష్టపడాల్సిందే. అసలు భారత్ ఫైనల్ కు చేరాలంటే సమీకరణాలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం.
భారత్ 5-0, 4-1, 4-0 లేదా 3-0తో ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంది. ఇలా జరిగితే… ఇతర జట్ల ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా రోహిత్ (Rohith Sharma) సేన ఫైనల్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఆస్ట్రేలియాను రేసు నుండి వైదొలిగే అవకాశం ఉంది. రెండో అవకాశం చూస్తే… భారత్ 3-1తో ఆస్ట్రేలియాపై విజయం సాధించాలి. 5 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియాపై భారత్ 3-1తో విజయం సాధిస్తే, రెండో టెస్టులో దక్షిణాఫ్రికా శ్రీలంక చేతిలో ఓడిపోతే… అర్హత సాధించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, భారత్కు 3-1 సిరీస్ విజయం సాధించినా శ్రీలంకతో దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ లో ఓడిపోవాల్సి ఉంటుంది.
భారత్ 3-2తో ఆస్ట్రేలియా(Australia)ను ఓడించినా అవకాశం ఉంటుంది. అయితే శ్రీలంక… ఆస్ట్రేలియాను ఓడించడం లేదా… డ్రా చేయాల్సి ఉంటుంది. జనవరి 29 నుండి ప్రారంభమయ్యే 2-మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాతో కనీసం డ్రా అయినా చేసుకోవాలి. ఆస్ట్రేలియాతో జరిగే సీరీస్ ను భారత్ 2-2తో సమం చేస్తే… భారత్కు అర్హత అవకాశాలు మరింత తగ్గుతాయి. అప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో శ్రీలంకను 2-0 తో ఓడించడం దక్షిణాఫ్రికాకు తప్పనిసరి అవుతుంది. అప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే 2-మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను లంకేయులు తప్పనిసరిగా గెలవాలి.






