Jagan: పాదయాత్ర పై క్లారిటీ.. తిరిగి యాక్టివ్ మోడ్‌లో జగన్..
గతంలో పాదయాత్రపై చేసిన ప్రకటనకు తాజాగా మరింత స్పష్టత ఇస్తూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) మరోసారి రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా వచ్చే ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల మధ్యే ఉండి పాదయాత్ర చేపడతానని ఆయన వెల్లడించారు. ఈ పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి కార్యకర్తను నేరుగా కలుస్తానని చెప్పారు. పార్టీని మళ్లీ బలంగా తీర్చిదిద్దడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
బుధవారం తాడేపల్లి (Tadepalli)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం (Bhimavaram) నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో తన రాజకీయ ప్రయాణంలో తీసుకురాబోయే మార్పులపై కూడా ఓపెన్‌గా మాట్లాడారు. రాబోయే రోజుల్లో కనిపించబోయే “జగన్ 2.0” పూర్తిగా కార్యకర్తల కేంద్రంగా ఉంటుందని స్పష్టంగా తెలిపారు.
గతంలో తాను పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టానని, ఆ క్రమంలో పార్టీ శ్రేణులకు కావాల్సినంత సమయం కేటాయించలేకపోయానని ఆయన అంగీకరించారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని, గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేపట్టి కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. కార్యకర్తల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలతో వైసీపీ (YSRCP)లో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా, అధికార కూటమిలో కూడా ఈ అంశంపై చర్చలు మొదలయ్యాయి.
పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పాదయాత్రే సరైన మార్గమని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర పార్టీకి చారిత్రక విజయాన్ని అందించిందన్న విషయం ఆయనకు బలమైన నమ్మకంగా ఉందని అంటున్నారు. ఆ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనుభవం, ఇప్పటి రాజకీయ వ్యూహాలకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల ఫలితాలతో నిరాశలో ఉన్న కార్యకర్తలకు మళ్లీ ధైర్యం నింపడమే ఈ యాత్ర లక్ష్యమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రస్తుతం రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా, వాటిలో 150 చోట్ల ప్రత్యక్షంగా పర్యటిస్తానని జగన్ చెప్పారు. పాదయాత్ర ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుందన్న వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే రాయలసీమ (Rayalaseema) నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం (Ichchapuram) వరకు సాగేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల నాటికి జగన్ హాజరయ్యేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో రాబోయే రాజకీయ దృశ్యం మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది.






