Jagan: అబద్ధాల హామీలు, అవినీతి పాలన.. చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)తో పాటు కూటమి ప్రభుత్వ నాయకులపై వైసీపీ (YCP) అధినేత జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ సిక్స్ (Super Six) అంటూ ప్రచారం చేసిన అంశాలన్నీ అబద్ధాలేనని, వాటి ద్వారా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సాధారణంగా ఇలాంటి మోసాలకు పాల్పడితే 420 కేసులు పెట్టి జైలుకు పంపుతారని, కానీ అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, కూటమి నేతలు మాత్రం ఎలాంటి కేసులు లేకుండా బయట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.
రెండేళ్ల పాలన పూర్తయ్యినా ప్రజలకు ఒక్క మంచి పని కూడా జరగలేదని జగన్ విమర్శించారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల వరకు అప్పులు చేసిందని, ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చయ్యిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా మద్యం వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం చంద్రబాబు తో పాటు ఆయనకు దగ్గరైన వ్యక్తుల జేబుల్లోకే వెళ్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని మద్యం షాపులన్నీ చంద్రబాబు అనుచరుల ఆధీనంలోనే ఉన్నాయని, బెల్టు షాపులు కూడా అదే వర్గాల చేతిలో నడుస్తున్నాయని చెప్పారు. ఎమ్మార్పీ (MRP) ధరలకు మద్యం అమ్మడం లేదని, ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వైసీపీ హయాంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా రద్దయ్యాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చంద్రబాబులా ప్రజలను మాటలతో మోసం చేయడం మరెవరికీ సాధ్యం కాదని సెటైర్లు వేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఇది అని విమర్శించారు.
తాడేపల్లి (Tadepalli)లోని పార్టీ కార్యాలయంలో భీమవరం (Bhimavaram) నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులతో జరిగిన సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్లి నిజాలు వెల్లడిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరంగా తెలియజేస్తామని తెలిపారు. కూటమి పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి రానున్న ఎన్నికల్లో స్పష్టంగా బయటపడుతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.






