AP Budget: మూడున్నర లక్షల కోట్ల దిశగా ఏపీ బడ్జెట్.. అభివృద్ధిపై ఆశలు..
ఏపీ బడ్జెట్‌కు (AP Budget) రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు జరుగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమావేశాల తొలి రోజున రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తరువాతి రోజు అంటే 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 14న రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) సమర్పించనున్నారు.
2024 జూన్ 12న రాష్ట్రంలో టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2025లో తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత బడ్జెట్లో మొత్తం వ్యయం మూడు లక్షల 22 వేల కోట్ల రూపాయలకు పైగా ఉండటం విశేషం. తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్ల మైలురాయిని దాటింది. రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న అంచనాలు, వివిధ రంగాల నుంచి వచ్చే ఆదాయంపై నమ్మకంతో ఆ బడ్జెట్‌ను రూపొందించారు.
ఇప్పుడు రానున్న బడ్జెట్ గతాన్ని మించే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసారి బడ్జెట్ పరిమాణం మూడున్నర లక్షల కోట్ల రూపాయల వరకు చేరవచ్చని చర్చ జరుగుతోంది. గత ఏడాది కాలంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, పరిశ్రమలు ఏర్పాటు కావడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో ప్రభుత్వం ముందుకెళ్తుండటంతో వ్యయ పరిమాణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈసారి బడ్జెట్‌ను అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా రూపొందించనున్నట్లు సమాచారం. అన్ని వర్గాలకు సమానంగా మేలు చేసేలా కేటాయింపులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధికి గణనీయమైన నిధులు కేటాయించే అవకాశముందని అంచనా. అలాగే పోలవరం (Polavaram) ప్రాజెక్టుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం దక్కవచ్చని అంటున్నారు. సాగునీటి పారుదల రంగానికి ఈసారి బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమతూకంగా ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని సమాచారం. గత ఆర్థిక సంవత్సరం 2025–26లో వ్యవసాయ రంగానికి సుమారు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి ఆ మొత్తాన్ని పెంచే అవకాశముందని చెబుతున్నారు. కనీసంగా 60 వేల కోట్ల రూపాయల వరకు వ్యవసాయ బడ్జెట్ ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే ఈసారి ఏపీ బడ్జెట్‌పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తాలు వివిధ రంగాలకు కేటాయించే అవకాశం ఉండటంతో రైతులు, యువత, పరిశ్రమల వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్దేశించే కీలక మలుపుగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.






