Middle East War: పశ్చిమాసియా సంక్షోభం.. శాంతి దూతలుగా రష్యా, చైనా..!
పశ్చిమాసియాలో (Middle East War) రోజురోజుకూ రగులుతున్న యుద్ధ జ్వాలలను చల్లార్చేందుకు అగ్రరాజ్యాలైన రష్యా, చైనా ఏకమయ్యాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులతో హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) సహా గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. శాంతి స్థాపన కోసం ఈ రెండు దేశాలు దౌత్యపరమైన మంతనాలను ముమ్మరం చేశాయి. కేవలం సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమవుతుందని ఉద్ఘాటించాయి.
రంగంలోకి రష్యా.. పుతిన్ దౌత్యం
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము పూర్తిస్థాయిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. రష్యా ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ మాట్లాడుతూ.. యుద్ధాన్ని (Middle East War) రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకోవాలన్నదే తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగానే పుతిన్.. గల్ఫ్, అరబ్ దేశాధినేతలతో నిరంతరం టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా గతేడాది అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన రష్యన్-అరబ్ దేశాల కీలక శిఖరాగ్ర సమావేశాన్ని కూడా అతి త్వరలోనే నిర్వహించనున్నట్లు పెస్కోవ్ స్పష్టం చేశారు.
మరోవైపు వ్లాదిమిర్ పుతిన్ కూడా సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS)తో జరిగిన ఫోన్లో ఈ యుద్ధం (Middle East War) విషయమై మాట్లాడారు. పశ్చిమాసియాలో తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలని ఉభయ నేతలు పిలుపునిచ్చారు. ఈ దాడుల్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం, ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమవడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన (ఎనర్జీ) మార్కెట్లో తలెత్తుతున్న తీవ్రమైన ఒడిదుడుకులను అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలు నొక్కిచెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అమెరికా, ఇజ్రాయెల్‌పై చైనా ఫైర్
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద శాంతి నెలకొల్పేందుకు చైనా సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. దీనికోసం సంబంధిత భాగస్వామ్య పక్షాలతో లోతైన చర్చలు జరుపుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. అయితే ప్రస్తుత సంక్షోభానికి (Middle East War) అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని డ్రాగన్ కంట్రీ నేరుగా ఆరోపించింది. ఇరాన్‌పై ఈ రెండు దేశాలు అక్రమంగా, అన్యాయంగా మిలిటరీ దాడులకు దిగడం వల్లే హోర్ముజ్ వద్ద నౌకాయానానికి (నౌకా రవాణాకు) తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని మావో నింగ్ విమర్శించారు.
హోర్ముజ్ పరిసర ప్రాంతాల్లో కాల్పుల విరమణ (సీజ్ఫైర్) జరగాలని అంతర్జాతీయ సమాజం మొత్తం కోరుకుంటోందని చైనా అభిప్రాయపడింది. మిలిటరీ దాడులతో ఎప్పటికీ సమస్యలు పరిష్కారం కావని, ఈ ఉద్రిక్తతలను సానుకూల వాతావరణంలో తొలగిస్తేనే హోర్ముజ్‌లో పూర్తి భద్రత ఏర్పడుతుందని స్పష్టం చేసింది. దాడులు (Middle East War) పెంచడం వల్ల ఏ ఒక్క దేశానికీ ప్రయోజనం ఉండదని చైనా హెచ్చరించింది.






