Virat Kohli: ఇండియాకు షాక్, కోహ్లీ గాయపడ్డాడా…?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ గెలిచి ఊపు మీదున్న భారత్ కు రెండో టెస్టులో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. మొదటి టెస్ట్ లో సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చిన సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మోకాలి గాయం ఇప్పుడు భారత శిబిరాన్ని కలవరపెడుతోంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ లో డే అండ్ నైట్ టెస్ట్ మొదలుకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ము రేపిన భారత జట్టు సోమవారం సాయంత్రం అడిలైడ్ చేరుకుంది. అయితే స్టార్ బ్యాటార్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ స్టేషన్లో మోకాలికి బ్యాండేజ్ తో కనిపించాడు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో రెండో టెస్టులో కోహ్లీ ఆడతాడా లేదా అనే దానిపై ఇప్పుడు స్పష్టత రావడం లేదు. ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లీ కుడి మోకాలు నొప్పితో బాధపడ్డాడని దీనితో వైద్య సిబ్బంది అతని కాలికి బ్యాండేజ్ వేసినట్టు తెలుస్తోంది. అయితే కోహ్లీ ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నట్లు ఫోటోల్లో కనపడలేదు. ఒకవేళ కోహ్లీ మ్యాచ్ కు దూరమైతే మాత్రం అది ఖచ్చితంగా భారత శిబిరానికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కారణం ఆడిలైడ్ మైదానంలో విరాట్ కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది.
63.62 సగటుతో ఎనిమిది ఇన్నింగ్స్ లో 509 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 2014లో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 115 పరుగులు రెండో ఇన్నింగ్స్ లో 141 పరుగులు చేసి సత్తా చాటాడు. అలాగే పింక్ బాల్ టెస్ట్ లో సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే. దీనితో కోహ్లీ గాయం కారణంగా దూరమైతే మాత్రం అది ఖచ్చితంగా భారత్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఇప్పటికే కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అంచనాకు వచ్చినట్లుగా సమాచారం. మొదటి జట్టునే దాదాపుగా కంటిన్యూ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రోహిత్, గిల్ తిరిగి జట్టులోకి రావడంతో జురెల్, పదిక్కల్ ను పక్కన పెట్టనున్నారు.






