JD Vance: భారత్‌లో పర్యటించనున్న జేడీ వాన్స్, ఉషా దంపతులు.. ముహూర్తం ఫిక్స్!
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) తన భార్య ఉషా వాన్స్‌తో (Usha Vance) కలిసి భారతదేశంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు తొలి భారత పర్యటన కావడం గమనార్హం. ఈ జంట ముందుగా ఇటలీ వెళ్లనుంది. ఆ తర్వాత భారతదేశం వచ్చి, ఇక్కడి నుంచి తిరిగి యూఎస్ వెళ్లిపోతుంది. ఈ నెల 18 నుండి 24 వరకు కొనసాగే ఈ పర్యటనలో వాన్స్ దంపతులు రెండు దేశాలలోని ప్రముఖులతో కీలకమైన చర్చల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన వివరాలను యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో వాన్స్ (JD Vance) దంపతులు వ్యాపార సంబంధాలు, భౌగోళిక రాజకీయ వ్యూహాలపై చర్చలు జరుపుతారు. భారతదేశంలో ఢిల్లీ, జైపూర్, ఆగ్రాలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జేడీ వాన్స్ సమావేశం కానున్నారు. భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉషా వాన్స్ తెలుగమ్మాయే..!
యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) భార్య ఉషా వాన్స్.. తెలుగు మూలాలున్న అమెరికన్ మహిళ. ఉషా పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రు సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన వారు. ఆమె తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి.. 1970లలో అమెరికాకు వలస వెళ్లారు. ఉషా వారి ముగ్గురు పిల్లలలో ఒకరు. యేల్ లా స్కూల్లో జేడీ వాన్స్, ఉషా కలుసుకున్నారు, వారి పరిచయం ప్రేమగా మారి 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. జేడీ వాన్స్ రాజకీయ జీవితంలో ఉషా కీలక పాత్ర పోషించారు.







