America : హౌతీలపై అమెరికా భారీ దాడులు
ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్ తిరుగుబాటు దళం హతీలపై అమెరికా (America) పెద్దఎత్తున దాడి చేసింది. యెమెన్ రాజధాని సనా (Sana)పై యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకుపడిరది. ఈ దాడుల్లో ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. పేలుళ్ల వల్ల పెద్దఎత్తున మంటలు, పొగలు ఎగసిపడటం కనిపించింది. నౌకలపై దాడుల్ని హూతీలు ఆపకపోతే వారిపై విధ్వంసకరంగా విరుచుకుపడతామని అమెరికా ప్రకటించిన రెండ్రోజుల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై మన ధీరులైన యోధులు గగనతలదాడులు చేస్తున్నారు. మన నౌకా స్థావరాలు, వాయు స్థావరాలు, నౌకదళాలను పరిరక్షించుకునేందుకు పాటుపడుతున్నారు. స్వేచ్చాయుత నౌకాయాన వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి పాటుపడుతున్నారు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తీ ఆపజాలదని స్పష్టం చేశారు. తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఇరాన్ (Iran)ను హెచ్చరించారు. హూతీల చర్చలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.






