India : భారత్‌కు చెందిన రెండు సంస్థలపై అమెరికా ఆంక్షలు
ఇరాన్ చమురు సరఫరాకు సాయం చేస్తున్నారన్న ఆరోపణలపై భారత్ (India) కు చెందిన ఓ వ్యక్తి, అతని రెండు సంస్థలపై అమెరికా (America) ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడిరచింది. భారత్‌కు చెందిన జగ్వీందర్ సింగ్ బ్రార్ (Jagwinder Singh Brar) కు యూఏఈ (UAE) లో పలు వ్యాపారాలు ఉన్నాయి. ఈ కంపెనీలు దాదాపు 30 నౌకలను నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు భారత్‌లోని గ్లోబల్ ట్యాంకర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బి అండ్ పీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జగ్వీందర్ బ్రార్‌కు యాజమాన్య నియంత్రణ ఉంది. అయితే, ఈయన నౌకలు, ఇరాన్ షాడో ఫ్లీట్ లో భాగంగా పనిచేస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ నౌకలు ఇరాన్ (Iran) చమురును మారు పేరుతో అక్రమంగా అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేస్తున్నాయని పేర్కొంది. దీంతో జగ్వీందర్ తోపాటు, భారత్‌కు చెందిన అతడి రెండు కంపెనీలు, యూఏఈ లోని మరో రెండు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది.







