అమెరికాలో పోలీసుల కాల్పులు
అమెరికాలో 13 ఏళ్ల పిల్లాడు పోలీసు తూటాకు బలయ్యాడు. తుపాకీ చూపించి డబ్బులు దోచుకుంటున్న ఒక ముఠా గురించి గాలిస్తున్న పోలీసు బృందం అనూహ్యంగా పిల్లాడిని పొట్టనబెట్టుకుంది. యుటికాలో సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు టీనేజర్లను పోలీసులు ఆపి మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు కదా? అని అడిగారు. వారిలో 13 ఏళ్ల న్యాప్ా ఎంవా ఒక్కసారిగా పరుగెత్తడంతో పోలీసులు వెంటపడ్డారు. దాంతో పిల్లాడు తన దగ్గరున్న బొమ్మ పెల్లెట్ గన్‌తో బెదిరించాడు. దాన్ని నిజమైన గన్‌గా భావించి ప్యాట్రిక్ హష్నే అనే పోలీసు పిల్లాడిని కిందపడేసి పట్టుకోబోయాడు. మరో ఇద్దరు పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. పెనుగులాటలో పిల్లాడిని ప్యాట్రిక్ షూట్ చేశాడు. ఛాతిలో తూట దిగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పిల్లాడు చనిపోయాడు. మొత్తం ఉదంతం పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. వారి అతి జాగ్రత్తలు అమాయక పౌరులను బలిలీసుకుంటున్నాయని పిల్లాడి సంతాప సభలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరుపుతామని సిటీ మేయర్ హామీ ఇచ్చారు. అంతర్గత కలహాలతో రగిలిపోతున్న మయన్మార్ నుంచి పిల్లాడి కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం అమెరికాకు వలసవచ్చింది.






