హర్మూజ్ జలసంధిలో ముదిరిన పోరు.. ఇరాన్ నౌకా వ్యవస్థపై పెంటగాన్ గురి
US vs Iran: పశ్చిమాసియాలో కొరకరాని కొయ్యగా మారిన ఇరాన్‌ను దారికి తెచ్చుకోవడానికి అమెరికా మరో కఠినమైన వ్యూహాన్ని అమలు చేయబోతోంది. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతోంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే, ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకలు , చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదనను పెంటగాన్ పరిశీలిస్తోంది.
జలరవాణా వ్యవస్థను స్తంభింపజేయడం..
ఇప్పటికే ఇరాన్ పోర్టులపై ఆంక్షలు విధించిన అమెరికా, ఇప్పుడు ఆ దేశ జలరవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేయాలని భావిస్తోంది. ఇరాన్‌కు ముడి పదార్థాలను సరఫరా చేసే నౌకలు, అలాగే అక్కడి నుంచి చమురు తరలించే ట్యాంకర్లను అమెరికా రాడార్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించబోతోంది. ఈ చర్యల ద్వారా ఇరాన్‌పై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి తీసుకురావచ్చని అమెరికా అంచనా వేస్తోంది. ఇటీవల ఇరాన్ నౌకలు కొన్ని నౌకలపై కాల్పులు జరిపిన నేపథ్యంలో అమెరికా ఈ దూకుడును పెంచడం గమనార్హం.
అమెరికా కొత్త ఆంక్షలు..
హర్మూజ్ జలసంధిలో ఇప్పటివరకు అమెరికా సుమారు 23 నౌకలను అడ్డుకుంది. ఆయుధాలు లేదా చమురు అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఈ తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం ఇరాన్ రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును వివిధ మార్గాల ద్వారా విక్రయిస్తోంది. ఈ అమ్మకాలను అడ్డుకునేందుకు ఇరాన్ నౌకలు, సంబంధిత కంపెనీలు , వ్యక్తులపై అమెరికా కొత్త ఆంక్షలను కూడా అమల్లోకి తెచ్చింది.
అమెరికా తీసుకోబోయే ఈ నిర్ణయాలతో ఉద్రిక్తతలు కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






