ఇరాన్ పై భీకర దాడులకు అమెరికా ప్రణాళికలు..! ఇజ్రాయెల్ కు 6500 టన్నుల సైనిక సామాగ్రి సరఫరా..!
అమెరికా – ఇజ్రాయెల్ ఎంతగా దాడులు చేస్తున్నా.. ఇరాన్ లొంగడం లేదు. సరికదా ప్రతిదాడులతో ధీటుగా బదులిస్తోంది. ఓవైపు తాను ఎంతగా నష్టపోతున్నా.. అమెరికాను సైతం అదేస్థాయిలో దెబ్బతీస్తోంది. దీంతో మధ్యలో కాల్పుల విరమణ పేరుతో కాస్త విరామం తీసుకున్న అమెరిాకా.. ఇరాన్ పై మరోసారి భీకర దాడులకు సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీగా సైనిక సామగ్రి చేరుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
24 గంటల వ్యవధిలోనే అమెరికా నుంచి 6500 టన్నుల సైనిక సామగ్రి అందినట్లు ఇజ్రాయెల్ (Israel) రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రెండు కార్గో నౌకలు, పలు విమానాల్లో ఈ సామగ్రి వచ్చింది. ఈ కార్గో నౌకలు అష్దోద్, హైఫా పోర్టుల్లో ఉన్నాయి. వీటిల్లో భూతల, గగనతల దాడులకు వినియోగించే ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మిలిటరీ ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్స్ వంటివి ఉన్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ (Iran)పై తాము చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 1,15,600 టన్నుల సైనిక సామగ్రిని అమెరికా పంపించినట్లు ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏ క్షణమైనా శత్రువులను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ పేర్కొన్నారు..
ట్రంప్ ముందుకు కొత్త ప్లాన్..
మరోవైపు, ఇరాన్‌పై సైనిక చర్యకు సంబంధించిన అమెరికా సెంట్రల్ కమాండ్ కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని ఇప్పటికే అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు వివరించినట్లు సమాచారం. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా స్వల్ప వ్యవధిలో అత్యంత శక్తిమంతమైన దాడులు చేయాలని ఈ ప్లాన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా దాడులతో టెహ్రాన్ చర్చలకు రాక తప్పని పరిస్థితి ఉంటుందని అమెరికా భావిస్తోంది. ఇక, హర్మూజ్ జలసంధిలో కొంత భాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకునే అంశాన్ని కూడా అగ్రరాజ్య సెంట్రల్ కమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తిగా వదిలేయాలని ట్రంప్ ముందునుంచీ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టెహ్రాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టే అంశాన్ని కూడా అమెరికా యోచిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఇరాన్‌పై మళ్లీ భీకర స్థాయిలో దాడులు జరుగుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.






