Tahawwur Rana : భారతీయులకు ఇలా జరగాల్సిందే.. హెడ్లీతో తహవ్వుర్ రాణా!

ముంబయి దాడుల (2008) ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవ్వుర్ రాణా (Tahawwur Rana) కు భారతీయుల పట్ల ఉన్న తీవ్ర ద్వేషాన్ని అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటన కళ్లకు కట్టింది. 26/11 మారణహోమం అనంతరం అతడు భారత్‌కు ఇలా జరగాల్సిందే అంటూ రాక్షసానందం పొందినట్లు అది తెలిపింది. రాణాను భారత్‌కు అప్పగించిన నేపథ్యంలో అమెరికా న్యాయ శాఖ (US Department of Justice) ఓ ప్రకటనను విడుదల చేసింది. ముంబయి (Mumbai) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు అమెరికన్లు సహా ఇతర బాధితులకు న్యాయం జరిగే దిశగా, అతడి అప్పగింతతో కీలక ముందడుగు పడినట్లు అందులో పేర్కొంది. 26/11 దాడుల అనంతరం హెడ్లీ (Headley)తో రాణా మాట్లాడారు. భారత్‌కు ఇలా జరగాల్సిందే అని అతడు పేర్కొన్నాడు. నాడు దాడిలో హతమైన 9 మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులను రాణా అమరులుగా కీర్తించాడు. యుద్ధంలో అమరులైన సైనికులకు పాకిస్థాన్ ఇచ్చే అత్యున్నత పురస్కారమైన నిషాన్-ఎ -హైదర్ (Nishan-a-Haider ) ను ఆ 9 మందికి ఇవ్వాలని కూడా సూచించాడు అని ప్రకటనలో తెలిపింది. రాణాను తమ మార్షల్స్ భారత అధికారులకు అప్పగిస్తున్న ఫొటోను అమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. అందులో అతడు జైలు దుస్తుల్లో చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో కనిపించాడు.