UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకున్న కొన్ని నిర్ణయాలు పలు దేశాలకు కలిసి వస్తున్నాయి. హెచ్ 1 బీ(H 1B) వీసా విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇక దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే విదేశీ నిపుణుల కోసం చైనా ఇప్పటికే కే వీసాను పరిచయం చేయగా.. ఇప్పుడు యూకే కూడా ఈ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ మీడియా ఈ మేరకు ఓ విషయాన్ని బయటపెట్టింది.
యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ప్రభుత్వం విదేశీ నిపుణులకు వీసా(uk visa) ఫీజులను తొలగించే అంశాన్ని పరిశీలిస్తోందని, దీనిపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. సైన్స్ మంత్రి పాట్రిక్ వాలెన్స్, వ్యాపార సలహాదారు వరుణ్ చంద్ర అధ్యక్షతన నడుస్తోన్న గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అగ్రశ్రేణి పరిశోధకులు, సాంకేతిక నిపుణులను తమ దేశానికి ఆకర్షించే మార్గాలను అన్వేషిస్తోందని తెలిపింది.
విదేశీ నిపుణులకు ప్రాధాన్యత ఇచ్చే అమెరికా వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటుంది యూకే. గ్లోబల్ టాలెంట్ వీసా కోసం 766 పౌండ్ల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫీజును తొలగించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనికి 1,035 పౌండ్ల వార్షిక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ప్రముఖ యూనివర్సిటీల నుంచి అగ్రశ్రేణి ప్రతిభావంతులను లేదా ప్రతిష్టాత్మక బహుమతుల విజేతలను లక్ష్యంగా చేసుకుందని మీడియా తెలిపింది.
నవంబర్ 26 లోపు ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ రోజున యూకే బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. సైన్స్, ఇంజనీరింగ్, వైద్యం, మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, కళలు మరియు సంస్కృతి, డిజిటల్ టెక్నాలజీ వంటి నిపుణులకు యూకే స్వాగతం పలుకోంది. యూకేలోని వర్క్ వీసా(Work Visa)లకు స్పాన్సర్ కావాల్సి ఉంటుంది. కాని ఇప్పుడు తీసుకునే నిర్ణయానికి స్పాన్సర్ తో పని లేదు. ఫాస్ట్-ట్రాక్ ఎంట్రీ అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే ఏడాది మొదటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.