Nara Lokesh: ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్

మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకే ‘విజయవాడ ఉత్సవ్’
దసరా ఉత్సవాలంటే విజయవాడ ఉత్సవాలు గుర్తుకురావాలి
ప్రతి సంవత్సరం ‘విజయవాడ ఉత్సవ్’ ను నిర్వహించాలి
ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహకారం అందిస్తాం
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ‘విజయవాడ ఉత్సవ్’ వేడుకలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్
విజయవాడ: మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకు ‘విజయవాడ ఉత్సవ్’ తోడ్పడుతుంది, దసరా ఉత్సవాలంటే ఇప్పటివరకు మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడుకునేవారని, ఇకపై దసరా ఉత్సవాలంటే ‘విజయవాడ ఉత్సవ్’ గురించి మాట్లాడుకునేలా వేడుకలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ లో నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు గారితో కలిసి విజయవాడ ఉత్సవ్ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. జై భవాని. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్య భూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మ ను దర్శించుకొని ఏ పని స్టార్ట్ చేసినా విజయమే. వెంకయ్యనాయుడు గారిని చూస్తూ పెరిగాను. ఆయన పట్టుదలను చూస్తే ఏమైనా సాధించవచ్చని అనిపిస్తుంది. ఆంధ్రా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా తన ప్రయాణం ప్రారంభించారు. ఎమ్మెల్యే, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. తెలుగుభాషను కాపాడేందుకు అహర్నిరిశలు కృషిచేశారు. ఆయన పోరాటం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో జీవోలన్ని తెలుగులో ఇవ్వడం జరుగుతోంది.
వాజ్ పేయి, అద్వానీ, మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకయ్యనాయుడు గారు
నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యేవరకు వదిలిపెట్టరు. నాయుడు గారిపై మాటలతో, వాదనలతో గెలిచిన వారు ఎవరూ లేరు. మనం ఎవరం మాట్లాడినా పది నిమిషాల తర్వాత బోర్ కొడుతుంది. కానీ వెంకయ్యనాయుడు గారు గంట సేపు ఉపన్యాసం ఇచ్చినా బోర్ కొట్టదు. అందరినీ నవ్విస్తూ ఉంటారు. వయసు ఒక సంఖ్య మాత్రమే. ఆయన స్పీడ్ చూసి ఈ రోజు కూడా నేను అసూయ పడుతున్నాను. ఎప్పుడు చూసినా పనితప్ప వేరే ఆలోచనలు ఆయనకు ఉండవు. గౌరవ సీఎం గారితో పోటీ పడాలని అనుకుంటున్నా.. నా వల్ల కావడం లేదు. అదే పరిస్థితి గౌరవ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉంది. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. వాజ్ పేయి, అద్వానీ, మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకయ్యనాయుడు గారు.
మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకు విజయవాడ ఉత్సవ్ తోడ్పడుతుంది
ఈ రోజు సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకు విజయవాడ ఉత్సవ్ తోడ్పడుతుంది. రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు వారి కళలను ప్రదర్శించేందుకు ఒక అద్భుతమైన వేదికగా విజయవాడ ఉత్సవ్ నిలవబోతోంది. దాదాపు మూడు వేలమంది కళాకారులు, 30 కళా రూపాలతో కోలాహలంగా రికార్డ్ స్థాయిలో ఉత్సవ ఊరేగింపు(కార్నివాల్) నిర్వహించబోతున్నాం. ఇప్పటికే కృష్ణా తీరాన ఆకాశ వీధుల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్ షో, డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సెర్ట్స్ చూశాం. పదకొండు రోజులపాటు ఐదు ప్రధాన వేదికలలో 250 కి పైగా కార్యక్రమాలను ఈ విజయవాడ ఉత్సవ్ లో వీక్షించబోతున్నాం.
దసరా ఉత్సవాలంటే విజయవాడ ఉత్సవాలు గుర్తుకురావాలి
వ్యవసాయ, వాణిజ్య, విద్య, ఆటో మొబైల్, చేనేత రంగాలకు చెందిన దాదాపు ఆరువందల స్టాల్స్ తో భారీ ఎక్స్ పో మనం ఏర్పాటుచేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్స్, పారామోటరింగ్ ఏర్పాటు చేశాం. ఆంధ్రా భోజనంతో పాటు దేశంలోని అన్ని క్యూజన్స్ విజయవాడకు తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు దేశం మొత్తం మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు దసరా ఉత్సవాలంటే విజయవాడ ఉత్సవాలు గురించి మాట్లాడుకుంటారు. ఆ విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా. ఈ ఉత్సవాల్లో పాల్గొనాలంటే నాకు కొంచెం ఇబ్బందికరం. దేశంలో ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తుపడతారు. కానీ లండన్ లో వింటర్ వండర్ ల్యాండ్ అని ఉంది. అక్కడికి నేను 2019లో వెళ్లాను. దశాబ్దాలుగా అక్కడ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇది కేవలం వన్ టైం వండర్ గా కాకుండా ప్రతి సంవత్సరం విజయవాడ ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఇదొక పర్మినెంట్ అట్రాక్షన్ గా ఉండాలి. టూరిజంను పెద్దఎత్తున ప్రోత్సహించాలి. అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్ గా విజయవాడ ఉత్సవ్ మారాలని నిర్వాహకులను కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారిని అభినందిస్తున్నా. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు.
‘విజయవాడ ఉత్సవ్’ ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఎన్.సి దాస్, కామినేని పట్టాభిరామయ్య, డాక్టర్ సమరం, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు దంపతులు, పాలడుగు లక్ష్మణరావు, జి.నారాయణ రావు, డాక్టర్ జంధ్యాల శంకర్, వక్కలగడ్డ భాస్కర్ రావు, మన్మోహన్ సింగ్, కోనేరు శ్రీధర్, దిండకుర్తి మహేష్, పేడేటి పుల్లయ్య, సుంకర రాజేంద్రప్రసాద్, బి.వెంకట్రావు, మోతుకూరి వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు.
అంతకుముందు పున్నమిఘాట్ కు చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పున్నమిఘాట్ లో నెలకొల్పిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, వంగలవూడి అనిత, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, వసంత కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, కొలికపూడి శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాము, ఏపీ, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ కన్వీనర్ ముత్తవరపు మురళీకృష్ణ, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు.