Gollapalli Family: రాజోలులో తండ్రీకూతుళ్ల సవాల్..!

కోనసీమ జిల్లాలోని రాజోలు (Razole) నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తండ్రి గొల్లపల్లి సూర్యారావు (Gollapalli Suryarao) వైసీపీ (YSRCP) ఇన్‌చార్జ్‌గా ఉంటుండగా, ఆయన కుమార్తె గొల్లపల్లి అమూల్యను (Gollapalli Amulya) తెలుగుదేశం పార్టీ (TDP) ఇన్‌చార్జ్‌గా నియమించింది. దీంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారతున్నాయి. TDP రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అమూల్యను టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీంతో ఇది కేవలం పార్టీల మధ్య పోరు కాకుండా, తండ్రి-కూతురు మధ్య రాజకీయ సవాల్‌గా మారింది.
గొల్లపల్లి సూర్యారావు 1981లో కొత్తపేట సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్థక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత TDPలో చేరి, 2014-2019 మధ్య రాజోలు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. TDPలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. కానీ 2024 ఎన్నికల సమయంలో TDP-జనసేన కూటమి రాజోలు సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన అసంతృప్తి చెందారు. దీంతో TDPకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో YSRCP తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు.
గొల్లపల్లి అమూల్య రాజకీయ ప్రయాణం తండ్రి వారసత్వంతోనే మొదలైంది. తండ్రి టీడీపీలో మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆమె నియోజకవర్గ కార్యక్రమాలు చూస్తూ వచ్చారు. 2024 ఎన్నికల ముందు తండ్రి వైసీపీలో చేరినా, అమూల్య మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు TDP అధిష్టానం ఆమెను రాజోలు ఇన్‌చార్జ్‌గా నియమించింది. అయితే తండ్రి వైసీపీలో ఉండగా, కుమార్తెను టీడీపీ ఇన్ ఛార్జ్ గా నియమించడం స్థానిక టీడీపీ నేతల్లో అసంతృప్తి రగులుతోంది. నిన్నటివరకూ తండ్రిబాటలోనే నడిచిన అమూల్యకు ఈ పదవి ఎలా ఇస్తారని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.
రాజోలు SC రిజర్వ్డ్ సీటు, 2019లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇది. జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు, ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. అయినా 2024 ఎన్నికల్లో రాపాకకు సీటు దక్కలేదు. గొల్లపల్లి సూర్యారావును బరిలోకి దించింది వైసీపీ. తాము గెలిచిన ఏకైక స్థానం ఇదే కాబట్టి రాజోలు సీటు తమకే కేటాయించాలని జనసేన పట్టుబట్టడంతో టీడీపీ కాదనలేక పోయింది. ప్రస్తుతం ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గంలో బలపడాలని టీడీపీ భావిస్తోంది. అందుకే అమూల్యను ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలుస్తోంది.
అయితే కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. ఈ పార్టీల ఏకైక శత్రువు వైసీపీ మాత్రమే. కాబట్టి టీడీపీ ఇన్ ఛార్జ్ గా అమూల్య ఇప్పుడు తన తండ్రి గొల్లపల్లి సూర్యారావుపై పోరాటం చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారావు యాక్టివగా ఉంటున్నారు. కాబట్టి తండ్రిని అమూల్య ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతోంది.