Danam Nagendar: తెలంగాణలో మరో ఉపఎన్నిక ఖాయం..?
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగేలా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) తరపున గెలిచి, ఆ వెంటనే కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకున్న ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్పీకర్ ద్వారా అనర్హత వేటు పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుండటంతో, ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
దానం నాగేందర్ వ్యవహారం మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కంటే భిన్నంగా, క్లిష్టంగా మారింది. సాధారణంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరితే, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలపై విచారణ పేరుతో స్పీకర్ కార్యాలయం కొంత సమయం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, దానం నాగేందర్ విషయంలో ఆ అవకాశం లేదు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా, ఏకంగా ఆ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. పార్టీ ఫిరాయించారనేందుకు ఇంతకు మించిన సాక్ష్యం, ఆధారం మరొకటి అవసరం లేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ వద్ద జరుగుతున్న అనర్హత పిటిషన్ల విచారణలో దానం నాగేందర్‌ను వెనకేసుకురావడం న్యాయపరంగా అసాధ్యం.
రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ స్పీకర్ గనక ఫిరాయింపుల చట్టం కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తే, ఆయన రాబోయే ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలుండదు. అదే జరిగితే దానం రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన దానం నాగేందర్, అనర్హత వేటు పడకముందే గౌరవంగా తన పదవికి రాజీనామా చేయడం ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చని, తద్వారా మళ్ళీ ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంటుందని ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలోనే దానం నాగేందర్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. తన పరిస్థితిని వివరించి, అనివార్య పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వస్తుందని ఆయన పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌లో మళ్ళీ ఉపఎన్నిక వస్తే తానే పోటీ చేసి, గెలిచి వస్తానని, ఆ తర్వాత తనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన కోరినట్లు సమాచారం. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది.
దానం నాగేందర్ రాజీనామా చేస్తే, ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక రావడం ఖాయం. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఇప్పటికే హైకోర్టులో అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుండటం, స్పీకర్ నిర్ణయంపై న్యాయస్థానం గడువు విధించే అవకాశాలు ఉండటంతో, దానం నాగేందర్ ముందస్తుగానే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి, దానం నాగేందర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తారు? ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారతాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






