Siddharth Subhash Chandrabose: అమరావతిపై ఫేక్ ప్రచారం.. GST అధికారి సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై (Amaravati) తప్పుడు ప్రచారం చేసినందుకు గానూ తిరుపతి వాణిజ్య పన్నుల శాఖ (GST) అసిస్టెంట్ కమిషనర్ ఎస్. సుభాష్ చంద్రబోస్ (Siddharth Subhash Chandrabose) పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాలో (Social Media) అమరావతి మునిగిపోయిందని వ్యంగ్యంగా పోస్టులు పెట్టినందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుభాష్ చంద్రబోస్ పై విచారణ జరిపిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. సుభాష్ చంద్రబోస్ మాట్లాడిన దాంట్లో తప్పేముందంటూ సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా చాలా మంది స్పందించారు. వైసీపీ కూడా ఆయనకు అండగా నిలిచింది. అయితే ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని సహించే ప్రసక్తం లేదంటూ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది.
కొంతకాలంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. అమరావతిలో (Amaravati) కోర్ క్యాపిటల్ ఏరియాలో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో పునాదుల్లోకి భారీగా నీరు చేరింది. ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ పునాదులు నిండిపోయాయి. కానీ అమరావతి మొత్తం మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టారు. ఇలాంటి చోట రాజధాని నిర్మాణమా అని ప్రశ్నించారు. అదే కోవలో జీఎస్టీ అధికారి సుభాష్ చంద్రబోస్ కూడా పోస్టులు పెట్టారు. అయితే ఆయన పెట్టిన పోస్టులు ఫేక్ అని ప్రభుత్వం నిర్ధారించింది.
ఆగస్టు 19న సుభాష్ చంద్రబోస్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అమరావతిపై వివాదాస్పద పోస్టులు పోస్ట్ చేశారు. ‘అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోలా? ఒకే ఒక్క వర్షం.. అమరావతి జలమయం!’ అని వ్యంగ్యంగా రాశారు. మరో పోస్టులో, ‘మూడు రిజర్వాయర్లు నిర్మించి అమరావతిని కాపాడాలా, లేక అమరావతిని రిజర్వాయర్‌గా మార్చాలా?’ అని ప్రశ్నించారు. ఈ పోస్టులు వైరల్ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఈ పోస్టులు చేయడం క్రమశిక్షణారాహిత్యానికి దారితీసింది. చంద్రబోస్ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా పనిచేస్తున్నారు. ఆయన పోస్టులు అమరావతిపై ద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని, YSRCP ఫేక్ న్యూస్‌కు మద్దతుగా ఉన్నాయని TDP నాయకులు ఆరోపించారు.
పోస్టులు వైరల్ అవ్వగానే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. చంద్రబోస్ పై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన పోస్టులు ప్రభుత్వ విధానాలపై దాడి చేసినవిగా, ప్రజల్లో అసమ్మతిని పెంచేవిగా ఉన్నాయని విచారణలో తేలింది. తాజాగా, ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో అసత్యాలు, వివాదాస్పద కంటెంట్ పోస్ట్ చేయకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేసింది. ‘ఫేక్ న్యూస్ ప్రచారం ప్రజాస్వామ్యానికి ముప్పు’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకునేందుకు విధివిధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
సుభాష్ చంద్రబోస్ పై చర్యలను కూటమి నేతలు స్వాగతించారు. ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ప్రభుత్వం సహించే ప్రసక్తే లేదని, ఎవరైనా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ మాయలో పడిన కొంతమంది ఉద్యోగులు ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, ఉద్యోగులు ఆ ట్రాప్ లో పడొద్దని సూచించారు. అయితే సుభాష్ చంద్రబోస్ పై చర్యలు తీసుకోవడం సరికాదని సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా పలువురు పోస్టులు పెడుతున్నారు.