ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ

అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోఆటా సాహిత్య విభాగం సదస్సు నిర్వహించిన దాశరథి శత జయంతి ఉత్సవ సాహిత్య సభ సాహిత్యాభిమానులను అలరించింది. కార్యక్రమాన్ని ఆటా సాహిత్య విభాగం చైర్ వేణు నక్షత్రం, కో-చైర్ రాజ్ శీలం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.
ప్రముఖ తెలుగు కవి, రచయిత శ్రీ దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వచించబడింది.
ప్రధాన అతిథులుగాప్రముఖ కవి, అవధాని శ్రీ నరాల రామారెడ్డి, శ్రీమతి సుభద్ర వేదుల, శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్ గార్లు పాల్గొని దాశరథి గారి సాహిత్య మహత్తు, కవిత్వ వైభవం, ఆవేశభరితమైన ఉద్యమ కవిత్వం గురించి విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ముఖ్యంగా శ్రీ నరాల రామారెడ్డి గారు,శ్రీ దాశరథి గారితో తన అనుబంధాన్ని వివరిస్తుంటే సాహిత్యాభిమానులు ఆసక్తిగా ఆలకించారు.
కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు శ్రీ జయంత్ చల్లా గారు ఆటా నిర్వహిస్తున్న సాంస్కృతిక, సామాజిక సేవలను వివరించారు. సాంస్కృతిక రూపాలైన సాంప్రదాయ నృత్యాలు, సంగీత కళారూపాలతో పాటు ఈసారి జరిగే కన్వెన్షన్ లో సాహిత్య విభాగం లో కవితల పోటీ కార్యక్రమాన్ని ఒక వినూత్న రూపంలో నిర్వహించి మంచి కవిత్వం రాసిన కవులను గొప్పగా సత్కరించబోతున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రముఖులు, స్థానిక సాహిత్యాభిమానులు, కవులు, రచయితలు కవితలు చదివి సభను కళకళలాడిరచారు. దాశరథి గారి విప్లవాత్మక కవిత్వం, తెలుగు భాషపై ఆయన చూపిన అపారమైన ప్రేమ, జైలు జీవితంలో సృష్టించిన అద్భుత సాహిత్య కృషి పై చర్చలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు శ్రీనివాస్ దార్గుల, సంతోష్ రెడ్డి కోరం, రీజనల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మెంబర్షిప్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ తుమ్మల , రీజనల్ కన్వీనర్ కృష్ణమోహన్ , ఆకుల ప్రసాద్ తదితర ఆటా కార్యనిర్వాహక సభ్యుల సహకారం తో సభ విజయవంతంగా జరిగింది.
సమాజ శ్రేయస్సే ధ్యేయంగా దాశరథి గారు చేసిన రచనల వారసత్వాన్ని మన రాబోయే తరానికి అందించాలని వక్తలు కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్యాభిమానులు, వక్తలు, కవులు అందరూ ఈ వేడుకను స్మరణీయంగా నిలిపారు.