US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ … టెక్ కంపెనీలపై బాంబేశారు. అవును.. హెచ్ 1 బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడంతో .. ఇప్పుడు టెక్ కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. ప్రస్తుతం అవి తీసుకుంటున్న వీసాలను పరిశీలిస్తే.. వాటికోసం ఏకంగా కంపెనీల యాజమాన్యాలు ఏటా 14 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇవి ఆయా కంపెనీలకు మోయలేని భారంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి లాటరీలో రానున్న కొత్త దరఖాస్తులపై ఇది పెను ప్రభావం చూపనుంది.
అమెరికన్లను నియమించుకొనేలా కంపెనీలపై ఒత్తిడి చేయడమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. గతేడాది అన్నీకలిపి 1,41,000 హెచ్1బీ వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లెక్కలు చెబుతున్నాయి. అదేస్థాయిలో వీసాలు జారీ చేస్తే.. వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తం 14 బిలియన్ డాలర్ల (రూ.1.23 లక్షల కోట్లు) గా అంచనాలు ఉన్నాయి. ఈ నిర్ణయం స్టార్టప్ సంస్థలకు శరాఘాతమేనని … విదేశాల్లోని టెక్ హబ్‌లకు ఇది ఓ బహుమతిగా మారిందని ఆందోళన వ్యక్తమవుతోంది..
ట్రంప్ (USA President Donald Trump) నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ వీసాలపై అధికారాల పరిధిని దాటి నిర్ణయం తీసుకొన్నారని చెబుతున్నారు. ట్రంప్ ప్రకటనను న్యాయస్థానాలు అడ్డుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీసాకు అవసరమైన కనీస వేతనం పెంపు వంటి విస్తృత మార్పులపై ట్రంప్ కార్యవర్గం గురిపెట్టి ఈ ప్రకటన చేసిందన్నారు. ఇప్పటికే కొందరు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు లాటరీ విధానంలో కాకుండా.. జీతాల ఆధారంగా ఈ వీసాలు మంజూరుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.