Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!

ప్రేక్షకులను ఒకప్పుడు ఉర్రూతలూగించిన హాలీవుడ్ యాక్షన్ సిరీస్ ‘అనకొండ’ (Anakonda) సరికొత్త అవతారంలో మళ్లీ వెండి తెరపైకి రాబోతోంది. ఈసారి కేవలం భయం మాత్రమే కాకుండా యాక్షన్, కామెడీ, క్రూరమైన గందరగోళం కలగలిపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. పాల్ రుడ్, జాక్ బ్లాక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మించిన ఈ చిత్రానికి టామ్ గోర్మికన్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, మధ్య వయసులో ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ – డగ్ (జాక్ బ్లాక్) మరియు గ్రిఫ్ (పాల్ రుడ్) – తమ అభిమాన పాత సినిమాను రీమేక్ చేయాలనుకుంటారు. ఇందుకోసం అమెజాన్ అడవిలోకి వెళ్లిన వీరికి ఊహించని విధంగా ఒక నిజమైన భారీ అనకొండ ఎదురవుతుంది. ఇక అప్పటి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వీరు సినిమా నిర్మాతల నుండి అసాధారణమైన పోరాట యోధులుగా మారాల్సి వస్తుంది.
ఈ సినిమాలో కామెడీ, థ్రిల్లింగ్ సాహసాలుతో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. స్టీవ్ జాన్, థాండివే న్యూటన్, డానియేలా మెల్చియోర్, సెల్టన్ మెల్లో వంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. బ్రాడ్ ఫుల్లర్, ఆండ్రూ ఫార్మ్, కెవిన్ ఎట్టెన్, మరియు టామ్ గోర్మికన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ క్రిస్మస్ కు అనకొండ ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక చిరస్మరణీయమైన సినిమా అనుభూతిని అందిస్తుంది.