White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!

అవకాశాల స్వర్గం.. డాలర్ డ్రీమ్స్ అమెరికా… అవును మరి ప్రతిభ ఉన్న వలసదారులు… అక్కడికి వెళ్లి ఆదేశాన్ని అలా మార్చేశారు. వారి ప్రతిభను… దేశానికి చేస్తున్న సేవలను గుర్తించిన నాటి ప్రెసిడెంట్స్.. వారిని అక్కున చేర్చుకున్నారే తప్ప, ఎలాంటి ప్రతిబంధకాలు సృష్టించలేదు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. వలస వాద వ్యతిరేకతను ఎగదోస్తూ ట్రంప్ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అమెరికా ఆర్థిక ప్రగతికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందంటున్నారు
వృత్తి నిపుణులకు ఆహ్వానం పలుకుతూ మూడున్నర దశాబ్దాల క్రితం తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా (H1B Visa) విధానం నవ్యావిష్కరణలకు నెలవుగా అమెరికా పరపతిని పెంచింది. అగ్రరాజ్య ఆర్థికాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించింది. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే హెచ్-1బీ వీసాలపై గత అధ్యక్షులెవరూ కఠిన వైఖరి అవలంబించలేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ వలస వ్యతిరేక జాతీయవాదంతో ట్రంప్ తన తొలి హయాంలోనే హెచ్-1బీ వీసాలకు సంబంధించి కఠిన నిబంధనలు విధించారు. వాటి వార్షిక రుసుమును ఒకేసారి లక్ష డాలర్లకు పెంచేసి ఇప్పుడు తీవ్ర అనాలోచిత నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో దాదాపు ముప్పావు వంతు మంది భారతీయులే! అందువల్లే ట్రంప్ యంత్రాంగం ప్రకటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గగ్గోలు రేపుతోంది.
పైకి మిత్రదేశం అంటూనే లోలోపల ఇండియాపై పగబట్టినట్టు ట్రంప్ వ్యవహరిస్తుండటానికి కారణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్య అపసవ్య విధానాలు అక్కడి సాగు ఉత్పత్తుల ఎగుమతులను దెబ్బతీశాయి. దానివల్ల అక్కడి రైతుల ఆదాయాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఇండియాతో వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పట్టాలకెక్కించాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. తన రైతాంగానికి నష్టం వాటిల్లకుండా ఇండియా ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఆయన అసహనంతో బుసలుకొడుతున్నారు. అంతకుముందే రష్యా నుంచి చమురు కొంటోందనే నెపంతో భారత ఎగుమతులపై యాభై శాతం సుంకాలను వడ్డించారు. ట్రంప్ ఆంక్షల ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ఇండియా ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న తరుణంలో వాణిజ్య ఒడంబడికపై ఒత్తిడి పెంచేందుకే హెచ్-1బీపై ఆయన కత్తిగట్టారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
కృత్రిమ మేధ నేడు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో ప్రపంచ దేశాల మధ్య పోటీ అధికమైంది. పరిశీలనల ప్రకారం- ఆయా సాంకేతికతల్లో తగినంత మంది నిష్ణాతులు అమెరికాలో లేరు. ఈ పరిస్థితుల్లో నిపుణ మానవ వనరుల రాకను ట్రంప్ బలవంతంగా నిలువరిస్తుండటం అంతిమంగా అమెరికాకే చేటు చేస్తుంది. ఆయన పెడపోకడలతో స్టార్టప్‌లు, మధ్యస్థాయి సంస్థలపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఈవేమీ ఆలోచించకుండా తాను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్లు అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తుండటం అందరినీ విభ్రాంతికి గురిచేస్తోంది!