China: ట్రంప్ దెబ్బకు రూటు మార్చేసిన చైనా..!

అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకుంటున్న నిర్ణయాలతో, భారత్ సహా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా హెచ్1బి(H 1B) వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో, దాదాపుగా కీలక దేశాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చైనా, భారత్ లాంటి దేశాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. చాలామంది టెక్ నిపుణులు ఈ విషయంలో అలజడికి గురవుతున్నారు. ఈ తరణంలో చైనా వీళ్ళకు గాలం వేస్తోంది. తమ దేశానికి రావాలని ఆహ్వానిస్తుంది.
తమ దేశ అభివృద్ధిలో విదేశీ నిపుణుల సహకారం ఎంతో కీలకమని, వాళ్లకు ఆహ్వానం పలుకుతుంది. పలు రంగాల్లో వీసా సౌలభ్యాలు కల్పిస్తూ, కే వీసా అనే దానిని పరిచయం చేసింది చైనా. ప్రస్తుతం ఉన్న 12 రకాల వీసాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ వీసా ద్వారా.. ఆ దేశంలో వ్యాపార కార్యకలాపాలలో భాగం కావడమే కాకుండా కొత్త వ్యాపారాలు కూడా స్థాపించుకోవచ్చు. అలాగే సంస్కృతి, విద్యా వంటి రంగాల్లో రాణించటానికి ఈ వీసా ఎంతగానో ఉపయోగపడుతుంది.
భారత్ రష్యా సహా కీలక దేశాలకు చైనా ఆహ్వానం పలుకుతుంది. శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలకు చెందిన నిపుణులు కూడా తమ దేశానికి రావాలని చైనా కోరింది. విదేశీ నిపుణుల అవసరం తమకు ఎంతో ఉందని, ముఖ్యంగా టెక్ అలాగే సైన్స్ రంగాల్లో విదేశాల సహకారం తీసుకునేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు బీజింగ్ ప్రకటించింది. ఈ వీసా ద్వారా తమ దేశానికి రావాలనుకునే వారికి స్వాగతం పలుకుతున్నామని, ఆలస్యం చేయకుండా చైనాలో అడుగు పెట్టాలని కోరింది.
ఎటువంటి ఇబ్బందికర షరతులు లేకుండా, వీసా మంజూరు చేస్తామని కూడా తెలిపింది. ప్రస్తుతం చైనా ఆర్థికమాంద్యంతో పాటుగా నిరుద్యోగ సమస్యతో కూడా కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఆ దేశాన్ని మరింత కకావికలం చేస్తున్నాయి. ఈ తరుణంలో విదేశీ నిపుణులు, తమ దేశానికి రావాలంటూ చైనా ఆహ్వానం పలకడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు రష్యా కూడా ఇదేవిధంగా విదేశీ నిపుణులకు ఆహ్వానం పలుకుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పరిస్థితుల్లో వేగంగా మార్పు కనపడుతుంది. ట్రంప్ నిర్ణయాలను ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.