4 నుంచి భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం.. ప్రకటించిన అమెరికా!

వాషింగ్టన్: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని మంగళవారం అంటే మే 4వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. భారత్లో విపరీతంగా నమోదవుతున్న కరోనా కేసులు, అలాగే ఇక్కడ వెలుగు చూస్తున్న కరోనా వేరియంట్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించారు. ఈ మేరకు వైట్‌హౌస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గడిచిన 14 రోజుల్లో భారత్‌లో ఉన్న వారెవరూ అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు. అయితే యూఎస్ పౌరులు, చట్టప్రకారం శాశ్వత పౌరసత్వం ఉన్నవారు, ఇతర అనుమతులు ఉన్నవారు తప్ప మిగిలిన వారెవరూ తమ దేశంలోకి ప్రవేశించడానికి వీల్లేదని అధ్యక్ష భవనం తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నిషేధం నుంచి అమెరికా పౌరులతో పాటు గ్రీన్ కార్డు హోల్డర్లు, వారి భార్యలు, 21లోపు పిల్లలకు మినహాయింపు ఇచ్చింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ బ్యాన్ అమలులో ఉంటుందని అమెరికా తేల్చిచెప్పింది. భారత్‌లో బయటపడుతున్న కరోనావైరస్ వేరింట్ చాలా ప్రమాదకరమని, అమెరికా వైద్య నిపుణుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైట్‌హౌస్ తెలిపింది. భారత్ నుంచి అమెరికా వచ్చే విదేశీయులకు 212(ఎఫ్) నిబంధనలు జారీ చేస్తామని తెలిపింది.
మినహాయింపు ఉన్న వారు కూడా అమెరికా బయలుదేరిన సమయంలో భారత్‌లో కరోనా టెస్టు చేయించుకొని నెగిటివ్ వచ్చిన తర్వాతే విమానం ఎక్కాలని సూచించింది. అలాగే వ్యాక్సిన్ తీసుకోకపోయి ఉంటే వారు క్వారంటైన్‌లో ఉండాలని, ఆపై అమెరికాలో విమానం దిగిన తర్వాత మళ్లీ కరోనా టెస్టు చేయించుకోవాలని స్పష్టం చేసింది.