BJP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన.. అసెంబ్లీ లో కూటమి విభేదాలు హైలెట్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కూటమి పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పదే పదే మూడు పార్టీలు కలిసే ఉంటాయని చెబుతున్నా, లోపల మాత్రం స్థానిక స్థాయిలో నేతల మధ్య పోటీ పెరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొన్నిసార్లు పబ్లిక్‌గా బయటకు వస్తోంది. తాజాగా ఎచ్చెర్ల (Echerla) బీజేపీ ఎమ్మెల్యే నడికుదిడి ఈశ్వరరావు (Nadikudi Eswara Rao) అసెంబ్లీ వేదికగానే తన ఆవేదన వ్యక్తం చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
గత ఎన్నికల్లో కూటమి ప్రభావంతో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి సులభంగా గెలిచిన ఈశ్వరరావు, అక్కడ బలమైన నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన విజయనగరం (Vizianagaram) ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Kalishetty Appalanaidu) ఆయనకు తోడుగా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కళా వెంకటరావు (Kala Venkata Rao) కూడా స్థానికంగా మంచి అనుభవం కలిగిన నేత. వీరితో కలసి పనిచేయడంలో సమస్యలు లేకపోయినా, పక్క నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నుంచి మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈశ్వరరావు అసెంబ్లీలోనే గట్టిగా చెప్పారు.
తాను బీజేపీ ఎమ్మెల్యేనని చిన్న చూపు చూస్తున్నారని, తనపై అబద్ధపు ప్రచారం జరిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియా ద్వారా తన ప్రతిష్ఠ దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనికి కారణం తాను నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఒక క్వారీపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేయడమేనని స్పష్టం చేశారు. తన ఫిర్యాదును పట్టించుకోకుండా కూటమి ఎమ్మెల్యేనే వైసీపీ (YSRCP) నేతలతో చేతులు కలిపారని, దీనివల్లే తనపై ప్రతికూల ప్రచారం జరుగుతోందని అసెంబ్లీలో వేదన వ్యక్తం చేశారు.
“వైసీపీ నేతలతో ఎంత పోరాటం చేసినా గెలవగలను, కానీ సొంత కూటమి ఎమ్మెల్యేనే ఎదుర్కోవడం కష్టమవుతోంది” అని ఆయన చెప్పిన మాటలు అక్కడున్న సభ్యుల దృష్టిని ఆకర్షించాయి. సభలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnam Raju) జోక్యం చేసుకుని, ఇది జీరో అవర్ కాబట్టి సమస్యను వేరే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ వ్యాఖ్యలతో కూటమి లోపలి విభేదాలపై మళ్లీ చర్చ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యే ఇబ్బందిపెడుతున్న టీడీపీ నాయకుడు ఎవరు అన్న ఆసక్తి సభ్యుల్లో కనిపించింది. ఉత్తరాంధ్ర (Uttarandhra) రాజకీయాలను బాగా తెలిసిన కొందరు ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టిలో ఉందని చెబుతున్నారు. అంతేకాక ఇటీవల ఒక వివాదాస్పద ఘటనలో ఆ టీడీపీ ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ (Lokesh) కూడా హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ఇలా అసెంబ్లీ వేదికపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు కూటమిలోని అంతర్గత లుకలుకలను స్పష్టంగా బయటపెట్టాయి. ఇది భవిష్యత్‌లో టీడీపీ–బీజేపీ–జనసేన కలయికలో కొత్త చర్చలకు దారితీయనుంది.