TTA: టీటీఏ ఇండియానా చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అమెరికాలో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రోత్సహించడంలో ముందువరుసలో ఉన్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) వివిధ నగరాల్లో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టిటిఎ ఇండియానా చాప్టర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21, 2025న నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వేలాదిమంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు తెచ్చిన బతుకమ్మ పండుగను దసరా నవరాత్రి సమయంలో మహిళలు ఘనంగా జరుపుకుంటారు. టీటీఏ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి గారి, సలహా మండలి అధ్యక్షులు డా. విజయపాల్ రెడ్డి గారి, సహ అధ్యక్షులు డా. మోహన్ రెడ్డి పట్లొళ్ళ గారి, సభ్యులు భరత్ మదడి గారి, శ్రీనివాస్ అనుగు గారి ఆశీస్సులతో, టీటీఏ అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారి మరియు కార్యనిర్వాహక సంచాలకులు, టిటిఎ బతుకమ్మ వేడుకల అడ్వయిజర్ కవితా రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఏడాది వేడుకలు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. వేలాది మంది పురుషులు, మహిళలు, పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొని సంస్కృతి పట్ల ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇండియానాలోని ఇండియానాపోలిస్‌లో జరిగిన అతి పెద్ద బతుకమ్మ వేడుకల్లో సుమారు 1200ం కుటుంబాలు పాల్గొని తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతికి ఎంతగానో గౌరవాన్నిచ్చారు. టీటీఏ సలహా మండలి అధ్యక్షులు డా. విజయపాల్ రెడ్డి మరియు శోభా రెడ్డి గారి వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో, టీటీఏ కార్యనిర్వాహక సంచాలకులు కవితా రెడ్డి, టీటీఏ ఇండియానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి పురుమండ్ల, స్టాండిరగ్ కమిటీ సహ అధ్యక్షులు సువీర్ రెడ్డి మల్లారెడ్డిగారి, సుశాంత్ రెడ్డి కల్లెం, టీటీఏ ఇండియానా బృందం, మరియు అనేక మంది వాలంటీర్లు కలిసి నొబుల్స్‌విల్లేలోని 4-హెచ్ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు సాంప్రదాయబద్ధంగా డప్పు వాయించే డోల్ తాషా సుకుమార్ గారు గ్రూప్ తో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో అందంగా మరియు వినూత్నంగా బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. శివలింగం బతుకమ్మ, అమ్మవారు బతుకమ్మతో సహా అనేక అద్భుతమైన బతుకమ్మలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఈ వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చారు. మధ్యాహ్నం 4:30 గంటలకు కార్మెల్ నగర మేయర్ సూ ఫింకం, నగర కౌన్సిల్ సభ్యురాలు డా. అనితా జోషీ ముఖ్య అతిథులుగా వేడుకలకు హాజరయ్యారు. టీటీఏ నాయకత్వం వారిని సాదరంగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా టీటీఏ కార్యకలాపాలను ఒక వీడియో ద్వారా ప్రదర్శించారు. అనంతరం ముఖ్య అతిథులు కూడా బతుకమ్మ ఊరేగింపులో పాల్గొన్నారు. టీటీఏ కార్యకలాపాలకు, బతుకమ్మ వేడుకలకు స్పాన్సర్లు చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుకల్లో టీటీఏ ఇండియానా మహిళలు 7 అడుగుల ఎత్తు ఉన్న బతుకమ్మను తయారు చేశారు. పూర్తిగా బంతిపూలు, చేమంతిపూలు, గులాబీలు మరియు గరికతో చేసిన ఈ బతుకమ్మ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్లాసీ ఈవెంట్ డెకార్స్ కు చెందిన స్వప్న వేదికను చాలా అందంగా అలంకరించారు. అమ్మవారి లొకేషన్ మరియు టీటీఏ లోగో ఫోటో బూత్ వద్ద అతిథులు ఫోటోలు దిగారు. మీడియా టీమ్ కు చెందిన హిమంత్ రెడ్డి మరియు చరణ్ రెడ్డి డ్రోన్ కెమెరా వీడియోలతో సహా వేడుకల్లో ప్రతి క్షణాన్ని చిత్రీకరించారు. శ్రీకాంత్ గొర్రిపాటి మరియు బీడబ్ల్యూఎస్ ఇంక్ టీమ్ ఆడియో, వీడియోలను అద్భుతంగా నిర్వహించి, టీటీఏ మరియు దాని కార్యకలాపాలను వీక్షకులకు అందించారు. హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ వారు రుచికరమైన భోజనాన్ని అందించారు. సాయంత్రం 5:30 గంటలకు సంధ్య రాపోలు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ నృత్యాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మహిళలు బతుకమ్మ ఆడారు. రాత్రి 7:30 గంటలకు వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా టీటీఏ 10వ వార్షికోత్సవం గురించి ప్రసంగించారు. ఉత్తమ నృత్యం, ఉత్తమ దుస్తులు, ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మూడు కేటగిరీల్లో బహుమతులను అందజేశారు. సుజాత కొల్లా మరియు శిల్పా నార్ల అమ్మవారికి హారతి ఇచ్చారు. అనంతరం డప్పుల నడుమ బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈ వేడుకలకు సహకరించిన వాలంటీర్లందరికీ టీటీఏ ఇండియానా బృందం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.