Operation Lungs: విశాఖలో ఆపరేషన్ లంగ్స్.. చిన్న వ్యాపారుల ఆవేదన తో కూటమిపై పెరుగుతున్న ఒత్తిడి..

విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో ఇటీవల కూటమి ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి పెరుగుతోంది. రాష్ట్రంలోనే కాకుండా జీవీఎంసీ (GVMC) లో కూడా కూటమి అధికారంలో ఉండటంతో ప్రజాగ్రహం మరింతగా ప్రతిబింబిస్తోంది. తాజాగా జీవీఎంసీ అధికారులు “ఆపరేషన్ లంగ్స్” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద పాదచార మార్గాలు, రహదారులు, ముఖ్య కూడళ్ల వద్ద ఉన్న బడ్డీలు, చిన్న షాపులు, అనుమతి లేని దుకాణాలను తొలగిస్తున్నారు. రోజువారీగా ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపారాలను ఖాళీ చేయిస్తున్నారు.
ఈ చర్యలతో వీధి వ్యాపారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కొడుతున్నారని, ఆకస్మికంగా దుకాణాలను కూల్చేస్తే కుటుంబాలు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వ్యాపారులు నిరసన వ్యక్తం చేయడంతో విపక్ష వైసీపీ (YSRCP) కూడా రంగంలోకి దిగింది. “చిన్న వ్యాపారులపై మీ అధికార ధోరణి ఎందుకు?” అంటూ వారు కూటమి నేతలపై ఆందోళన చేస్తున్నారు. జీవీఎంసీ కార్యాలయం ముందు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు.
ఇక కూటమి లోపల కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేన (Janasena) ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే అధికారులపై మండిపడ్డారు. ప్రజలతో ముందే మాట్లాడకుండా ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. “తాము మద్దతు ఇచ్చిన ప్రజలకు ఇప్పుడు ఏమి సమాధానం చెప్పాలి?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఇరుక్కుపోయారు.
కానీ అధికారులు మాత్రం , నగర సౌందర్యం కోసం, పాదచారుల భద్రత కోసం, రహదారులపై ట్రాఫిక్ సౌకర్యం కోసం ఈ చర్యలు అవసరమని చెబుతున్నారు. అంతేకాక, ఆపరేషన్ లంగ్స్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. అర్హులైన వీధి విక్రేతలను గుర్తించి వారికి కొత్త అవకాశాలు, జీవనోపాధి కోసం సహాయ పథకాలు కల్పిస్తామని చెబుతున్నారు.
అయితే విపక్షాలు ఈ వాదనను తిరస్కరిస్తున్నాయి. నిజంగా చిన్న వ్యాపారుల మేలు చేయాలనుకుంటే ముందే వారికి ప్రత్యామ్నాయ ప్రాంతాలు చూపించి అక్కడ వ్యాపారాలు కొనసాగించేలా అవకాశం ఇవ్వాల్సిందని అంటున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా కూల్చివేసి తర్వాత పరిష్కారాలు చూపుతామనడం అన్యాయం అని విమర్శిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉండటంతో రాజకీయంగా ఇది కూటమికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు నగర సుందరీకరణ వల్ల మంచి పేరు రావచ్చు కానీ మరోవైపు వేలాది చిన్న వ్యాపారులు, వారి కుటుంబాలు నష్టపోతున్నారని వారి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారుల ఉత్సాహం, కూటమి నేతల ఒత్తిడి, విపక్షాల ఆందోళనలు — ఇవన్నీ ఇప్పుడు విశాఖలో ఆపరేషన్ లంగ్స్ రాజకీయ చర్చలకు కారణమైంది. ఇది చివరికి కూటమికి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.