Donald Trump: ట్రంప్ సుంకాలపై చైనా ఏఐ వీడియో!
చిన్నా-పెద్ద, ప్రత్యర్థి-మిత్ర దేశాలనే తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల మోత మోగించారు. వీటిపై చైనా (China)కు చెందిన సీజీటీఎన్ వార్త సంస్థ వ్యంగ్యంగా ఓ వీడియోను రూపొందించింది. ఇది 2 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉంది. ట్రంప్ పాలక వర్గం గొప్పగా చెప్పుకొంటున్న లిబరేషన్ డే(Liberation Day) అంటే చాలా మంది అమెరికన్ల జీతాలు తగ్గించడం. ఖర్చులు పెంచడం అని ఎద్దేవా చేసింది. ఆయన చర్యలు అల్పాదాయ కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ వీడియోలో సుంకాల కారణంగా అమెరికన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపింది. టారిఫ్ల ప్రకటన రోజును లిబరేషన్ డే గా పేర్కొనడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. నిత్యావసర సరకులు, ఆహార పదార్థాల ధరలు పెరిగిపోవడంతోపాటు ఆటోమొబైల్ (Automobile ) ఉత్పత్తులపై సుంకాల ప్రభావాన్ని ప్రస్తావించింది. మరో మీడియా సంస్థ సైతం ఇలాంటి వీడియోనే విడుదల చేసింది. అందులో ఒక ఏఐ రోబో (AI Robot) ను టారిఫ్గా పేర్కొంది. వాణిజ్య యుద్ధం, అశాంతికి దారి తీసే అధిక సుంకాలను తట్టుకోలేక అది తనను తాను నిర్వీర్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఉంది.







