Trump Tariff Policy: బొమ్మల కంపెనీ దెబ్బ.. ట్రంప్ టారిఫ్ అబ్బా! అగ్రరాజ్యానికే షాకిచ్చిన వోల్డెన్బర్గ్!
అమెరికా: ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే, అగ్రరాజ్య అధ్యక్షుడి నిర్ణయాన్నే సవాల్ చేస్తూ.. అంతర్జాతీయ వాణిజ్య గమనాన్ని మార్చిన ఈ పోరాటం వెనుక ‘లెర్నింగ్ రిసోర్సెస్’ (Learning Resources Ltd) అనే ఓ చిన్న బొమ్మల కంపెనీ ఉంది.
మనుగడ కోసం న్యాయపోరాటం:
ఇల్లినోయీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ, చైనా నుంచి విద్యా సంబంధిత బొమ్మలను దిగుమతి చేసుకుంటుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక, దేశాల పట్ల వివక్ష లేకుండా అందరిపై భారీగా సుంకాలు మోపారు. దీనివల్ల కంపెనీ మనుగడే కష్టంగా మారడంతో, ఆ సంస్థ యజమాని రిక్ వోల్డెన్బర్గ్ గత ఏప్రిల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనలాంటి మరికొందరు వ్యాపారులతో కలిసి ఆయన చేసిన ఈ పోరాటం చివరకు విజయం సాధించింది.
వోల్డెన్బర్గ్ వాదన ఏంటి?
ప్రభుత్వం పన్నుల రూపంలో అమెరికన్ల దగ్గర అవసరానికి మించి అదనపు డబ్బు వసూలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒక దేశం తన ఆదాయాన్ని పెంచుకోవాలంటే చట్టసభల్లో చర్చ జరగాలి తప్ప, ఏకపక్ష నిర్ణయాలు పనికిరావని ఆయన స్పష్టం చేశారు. తయారీ కేంద్రాలను చైనా నుంచి అమెరికాకు మార్చడం అంత సులభం కాదని, అక్కడ ఉన్న నిపుణులైన కార్మికులు, భద్రతా ప్రమాణాలతో కూడిన వ్యవస్థను ఇక్కడ నిర్మించడానికి ఏళ్ల సమయం పడుతుందని వోల్డెన్బర్గ్ పేర్కొన్నారు.
ట్రంప్ సర్కార్కు ఊహించని షాక్:
యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గణాంకాల ప్రకారం.. అమెరికాలో 97 శాతం దిగుమతిదారులు చిన్న వ్యాపారులే. వీరు ఏటా దాదాపు 868 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను తీసుకొస్తారు. తాజా తీర్పుతో అదనపు సుంకాల వసూళ్లు నిలిచిపోనున్నాయి. అయితే, ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలా? లేదా? అనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఆ డబ్బును వెనక్కి ఇవ్వాల్సి వస్తే, ట్రంప్ ప్రభుత్వ ఆదాయ అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది.
ఒక చిన్న బొమ్మల కంపెనీ ప్రారంభించిన ఈ న్యాయపోరాటం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచింది.

















