లండన్ లో తెలంగాణ డే వేడుకలు
లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో మొదటిసారి తెలంగాణ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత హైకమిషనర్ విక్రమ్ దొరై స్వామి మాట్లాడుతూ ప్రవాసుల్లో ఐక్యత, విదేశీ గడ్డపై భారత సంస్కృతిని ప్రచారం చేసేందుకు వివిధ రాష్ట్రాల ఆవిర్భావ వేడుకలను భారత హైకమిషన్ అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంస్థ ప్రతినిధులు చురుగ్గా పాల్గొనడమే కాకుండా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక నృత్య ప్రదర్శన నిర్వహించారు. టాక్ సంస్థ ప్రతినిధులను హైకమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ తెలంగాణ డే వేడుకలను ఇక్కడ నిర్వహించడంపై సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ గతంలో కేసీఆర్ పిలుపు మేరకు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశామని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. టాక్ సంస్థ సభ్యులు స్వాతి, సుప్రజ, స్నేహ, కుమారి తన్మయ, విద్య చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






