Narendra Modi: సౌదీ అరేబియాలో ప్రధాని మోదీకి … అరుదైన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ఎన్నడూ లేనివిధంగా ఆ దేశం మోదీని ప్రత్యేకంగా స్వాగతించింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా (Saudi Arabia) గగనతలంలోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15 విమానాలు దానిని అనుసరించి, సగౌరవంగా స్వాగతించాయి. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు పడతాయని ఈ ఆత్మీయ స్వాగతం చాటుతోంది. ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ వెళ్లారు. ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి పలు కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. మోదీ, సౌదీ అరేబియా యువరాజు మొహ్మమద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman)ల నడుమ ఇటీవల జరిగిన చర్చలు తర్వాత ఇరుపక్షాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. భారత్ (India), సౌదీ అరేబియాల మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది.







