Ranji trophy: దేశం మారినా ఆట మారలేదు, రంజీల్లోనూ ఫెయిల్..!
ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma), రిషబ్ పంత్, శుభమన్ గిల్.. రంజీ ట్రోఫీలో కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియా పర్యటనలో రాణించినా రంజీ ట్రోఫీలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. వారిపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ… అంచనాలు అందుకోలేకపోయారు. భారత టెస్ట్ జట్టులో మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసే గిల్, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్సిమ్రాన్ సింగ్‌తో కలిసి ఓపెనింగ్ కు వచ్చాడు.
ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు చేసి వెనుదిరగడంతో గిల్ అవుట్ అయ్యాడు.అదేవిధంగా, రాజ్‌కోట్ లో సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ తరుపున బరిలోకి దిగిన రిషబ్ పంత్ పది బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. జమ్మూ & కాశ్మీర్‌పై రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ కు వచ్చారు. ఇద్దరినీ మొదటి ఆరు ఓవర్లలోనే J&K బౌలర్లు అవుట్ చేశారు. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ల పరాజయాల తర్వాత రోహిత్ విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో, ఫాంలో లేకపోవడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు రోహిత్. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలం కావడంతో సీనియర్ ఆటగాళ్ళ విషయంలో బోర్డు సీరియస్ అయింది. రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే అని స్పష్టం చేసింది. ఇక విరాట్ కోహ్లీ కూడా త్వరలో ఢిల్లీ తరుపున రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లి (Virat Kohli) సెంచరీ మాత్రమే చేసి ఆ తర్వాత ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇక కెఎల్ రాహుల్ గాయం కారణంగా రంజీ జట్టుకు దూరంగా ఉన్నాడు.






