Putin: ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్
ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రకటించారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు సహకరించాలంటూ అమెరికా(America), రష్యాపై ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ (Ukraine)తో చర్చలు జరిపేందుకు తాను సిద్దమని పుతిన్ తెలిపారు. అనేక సంవత్సరాల తర్వాత ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఇక ఈస్టర్ సందర్భంగా రష్యా ఒక రోజు కాల్పుల విరమణను పాటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి కాల్పుల విరమణలు మరిన్ని పాటించేందుకు కూడా సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు. శాంతి స్థాపనకు రష్యా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఉక్రెయిన్ నుంచి కూడా అదే ఆశిస్తున్నామని తెలిపారు. పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) ఇంకా స్పందించలేదు.







