హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి : రిషి సునాక్

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి లండన్ లోని నీస్‌డెన్‌లో గల బీఏపీఎస్ శ్రీస్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ నెల 4న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దైవ దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అక్కడ ఉన్న సేవా కార్యకర్తలు, హిందూ నాయకులతో సునాక్ మాట్లాడారు. భారత్ టీ20 ప్రపంచకప్ సాధించడాన్ని ప్రస్తావించారు. నేను హిందువును. ఇక్కడున్న మీరంటే నాకెంతో ఇష్టం. నేను నా విశ్వాసం నుంచి ప్రేరణ, ఓదార్పు పొందుతాను. భగవద్గీతపై పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేయడం నాకు గర్వకారణం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని మన విశ్వాసం బోధిస్తుంది. మన విధులను ఆత్మవిశ్వాసంతో నిర్వహించినప్పుడు ఫలితాన్ని చూసి చింతించకడదు. ప్రజాసేవకు సంబంధించి నా దృక్పథంలో నా ధర్మమే నాకు మార్గదర్శకత్వం. ఏ భర్తకు లభించని విధంగా నా భార్య నాకు గొప్ప మద్దతుదారే కాక, ప్రజా సేవ పట్ల నిబద్ధత కలిగిన మహిళ అని సునాక్ పేర్కొన్నారు. సునాక్ తన ఆలయ సందర్శన ద్వారా బ్రిటన్‌లోని హిందువుల ఓట్లను ఆకర్షిస్తున్నారు.