Draupadi Murmu: భారత రాష్ట్రపతికి స్లొవేకియాలో గౌరవ డాక్టరేట్
ప్రజాసేవా రంగంలో విశిష్ట సేవలకుగానూ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) స్లొవేకియా లోని కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ (Constantine the Philosopher University) నుంచి గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) స్వీకరించారు. పాలన, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి కోసం ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా దీనిని ప్రదానం చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. విద్య, మహిళా సాధాకారత, సాంస్కృతిక-భాషా వైవిద్ధ్యాలను పరిరక్షించి ప్రోత్సహించడానికి ఆమె ఆవిరళ కృషి చేస్తున్నారని ప్రశంసించింది. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయుల (Indians) తరపున తాను దీనిని స్వీకరిస్తున్నానని చెప్పారు. అస్తిత్వాన్ని తీసుకురావడంలో, విజ్ఞాన సంరక్షణలో భాషకున్న శక్తి అపూర్వమని అన్నారు. వ్యక్తిగత సాధికారతకే కాకుండా దేశాభివృద్ధికి విద్య ఒక సాధనమని తెలిపారు. నిత్రాలో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవ్ (Jaguar Land Rover) కార్ల పరిశ్రమను ఆమె సందర్శించారు. వాటి ఉత్పత్తిని పరిశీలించారు. అందులో పనిచేస్తున్న భారతీయులతో ముచ్చటించారు. ఈ దశాబ్దాంతానికి ప్రతి జాగ్వార్ మోడల్లో కనీసం ఒక విద్యుత్తు కారు ఉత్పత్తి చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.







