Sunita Williams: భూమికి చేరిన సునీతకు ‘వెల్కం బ్యాక్’ చెప్పిన ప్రధాని మోదీ
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సురక్షితంగా భూమికి తిరిగి రావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హర్షం వ్యక్తంచేశారు. మిషన్ విజయాన్ని సాధించడంలో సునీత, ఆమె సహచరుల చూపిన అపార ధైర్యం, సంకల్పాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. వారి అంకితభావానికి సెల్యూట్ చేశారు. సునీతకు (Sunita Williams) ‘‘వెల్కమ్ బ్యాక్’’ చెప్పిన ప్రధాని మోదీ.. ‘‘మీ అపరిమిత ధైర్యం, పట్టుదలతో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇబ్బందుల్లో కూడా మీరు చూపించిన ధైర్యసాహసాలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. మీరు ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు,’’ అంటూ కొనియాడారు.
అంతరిక్ష అన్వేషణ అంటే మానవ శక్తి పరిమితులను అధిగమించడం అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయంలో సునీత (Sunita Williams) తన కెరీర్ అంతటా గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించారు. ఆమె ఓ ఐకాన్, ఎంతో మందికి ఆదర్శప్రాయురాలు. సునీతతో పాటు మిగిలిన వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువచ్చేందుకు శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనతలు అభిరుచి, పట్టుదల, సాంకేతిక నైపుణ్యం కలిసినప్పుడు ఎంతటి అద్భుతాలు సాధ్యమవుతాయో వారు నిరూపించారు,’’ అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని తన యూఎస్ పర్యటనలో సునీత (Sunita Williams) కుటుంబంతో కలసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీర సమీపంలోని సాగరజలాల్లో సునీత (Sunita Williams), బుచ్ విల్మోర్ సురక్షితంగా దిగారు. స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ వ్యోమనౌక వారిని భూమికి తిరిగి తీసుకువచ్చింది. వీరితోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి భూమికి చేరుకున్నారు. కేవలం 8 రోజుల యాత్ర కోసం 2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన సునీత (Sunita Williams).. అనుకోని సాంకేతిక లోపాల వల్ల ఏకంగా 286 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ అనుకోని పరిస్థితి వల్ల సునీతను తిరిగి భూమికి తీసుకొచ్చే మిషన్ అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.






