ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10 తేదీల్లో ఆయన రష్యాతో పాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. గత అయిదేళ్లలో ప్రధాని మోదీకి రష్యా పర్యటన ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోను సందర్శించనుండటం ఇదే మొదటిసారి. అదే విధంగా భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే ప్రథమం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెల 8, 9 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మోదీ ఆస్ట్రియాను సందర్శించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్, ఛాన్సలర్ కర్ల్ నెహమెర్లతో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.






