త్వరలో భారత్ పర్యటనకు రండి.. కీర్ స్టార్మర్కు ప్రధాని మోదీ ఫోన్
బ్రిటన్ నూతన ప్రధానిగా లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో భారత్ పర్యటనకు రావాలంటూ ఆహ్వానించారు. ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాలను గుర్తు చేసుకున్న నేతలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిబద్ధతను చాటినట్లు భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.






