మోదీ, పుతిన్‌లు ఏదైనా చర్చించొచ్చు : క్రెమ్లిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా విశ్వసనీయమైన మైత్రి ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరలో వీరిద్దరి మధ్య మాస్కోలో జరిగే సమావేశంలో ఏ అంశమైనా చర్చకు రావొచ్చని తెలిపింది. ఫలానా విషయాన్ని వారు ప్రస్తావించరన్న విధానమేదీ ఉండదని వివరించింది. మోదీ మాస్కో పర్యటన తేదీలను త్వరలో వెల్లడవుతాయని, అయితే పర్యటనకు మాత్రం ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. అంతర్జాతీయ భద్రత, వాణిజ్యం, ప్రాంతీయ అంశాలు ఈ ఇద్దరు నేతల మధ్య చర్చకు వస్తాయన్నారు.






