MF Hussain: భారతీయ చిత్రకారుడు పెయింటింగ్.. వేలంలో రూ.118 కోట్లు!
ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ (MF Hussain) గీసిన ఓ పెయింటింగ్ (Painting) అరుదైన రికార్డు సృష్టించింది. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్ (New York)లో తాజాగా నిర్వహించిన వేలంలో హుస్సేన్ గీసిన అన్టైటిల్డ్ ( గ్రామ్ యాత్ర) కళాఖండం 13.8 మిలియన్ డాలర్ల (రూ.118 కోట్లు)కు అమ్ముడు పోయింది. దీంతో ఆధునిక భారత చరిత్రలో అత్యంత ఖరీదైన కళాకృతిగా ఇది రికార్డు సృష్టించింది. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షెర్గిల్ (Amrita Shergill )1937 లో గీసిన ది స్టోరీ టెల్లర్ పెయింటింగ్‌ను 2023లో వేలం వేయగా రూ.61.8 కోట్ల ధర పలికింది. అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా ఇప్పటివరకు ఇదే కొనసాగగా, తాజాగా ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ దీని కంటే రెట్టింపు ధర పలకడం విశేషం. ఎంఎఫ్ హుస్సేన్ కుంచె నుంచి జాలువారిన గ్రామ్ యాత్ర ఒకే కాన్వాస్‌లో 13 రకాల చిత్రాలతో రూపుదిద్దుకొంది. ఈ అద్భుత కళాఖండం కొత్త రికార్డు సృష్టించడంలో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని వేలం సంస్థ క్రిస్టీ (Christy ) ప్రతినిధులు పేర్కొన్నారు.






