US Deportations: ట్రంప్ హయాంలో భారీగా భారతీయుల డిపోర్టేషన్.. ఫస్ట్ టర్మ్‌లో ఎంతమందిని వెనక్కు పంపారో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం (US Deportations) మోపుతున్న నేపథ్యంలో గతంలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా గెలిచినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉందని గణాంకాలు చెప్తున్నాయి. ట్రంప్ హయాంలో ఎంత మంది భారతీయులను తిరిగి వెనక్కు పంపేశారనే ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ సమాధానం ఇచ్చింది. విదేశాంగ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. ట్రంప్ మొదటి టర్మ్‌లో (2017-2021) మొత్తం 6135 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి డిపోర్ట్ (US Deportations) చేశారు. ముఖ్యంగా 2019లో అత్యథికంగా 2042 మంది భారతీయులను వెనక్కు పంపారు. అయితే, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ గెలవడంతో 2021-2025 మధ్య ఈ సంఖ్య సగానికి సగం తగ్గిపోయి 3 వేలకు చేరింది.
భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, 2009 నుంచి 2024 మధ్య కాలంలో మొత్తం 15,564 మంది భారతీయులను అమెరికా వెనక్కి (US Deportations) పంపించింది. వీరిని చార్టెర్డు, వాణిజ్య విమానాల ద్వారా భారత్‌కు తరలించారు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2017 నుంచి 2021 మధ్య మొత్తం 6135 మంది భారతీయులను వెనక్కు పంపారు. సంవత్సరాల వారీగా ఈ లెక్కలు పరిశీలిస్తే.. 2017లో 1024 మంది, 2018లో 1180 మంది, 2019లో అత్యధికంగా 2042 మంది, 2020లో 1889 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం స్వదేశానికి (US Deportations) పంపింది. ఇక తాజాగా రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. ఇప్పటికే 388 మంది భారతీయులను డిపోర్ట్ చేయగా, మరో 295 మందిని వెనక్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. బైడెన్ హయాంలో 2021 నుంచి 2025 వరకు మొత్తం 3652 మంది భారతీయులను వెనక్కు పంపగా.. ఆయన తన ప్రభుత్వ చివరి సంవత్సరం 2024లోనే అత్యధికంగా 1368 మందిని డిపోర్ట్ (US Deportations) చేసినట్లు విదేశాంగ శాఖ లెక్కలు చెప్తున్నాయి.






