రెండు దేశాల ప్రయోజనాల ఆధారంగానే… ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్, మల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌కు స్పష్టం చేశారు. ఆరు నెలల క్రితం చైనా అనుకూలుడైన మహ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడైనప్పటి నుంచి ఆ దేశంతో మన దేశ ద్వైపాక్షిక సంబంధాలు తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో జై శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ పర్యటనకు వచ్చిన మూసా జమీర్‌తో ఢల్లీిలో జై శంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తాము పొరుగు వారికి ప్రథమ ప్రాధానం, విధానానికి కట్టుబడి ఉన్నామని, మాల్దీవులకు అవసరం ఉన్న ప్రతిసారీ ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జైశంకర్ ఎక్కడా చైనా పేరు ప్రస్తావించలేదు. ముయిజ్జు పగ్గాలు చేపట్టిన తర్వాత మాల్దీవుల నుంచి భారత్‌కు తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం గమనార్హం.






