America: అమెరికాలో కాల్పులు.. భారతీయ తండ్రీకూతుళ్ల మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రవాస భారతీయులైన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. వర్జీనియా (Virginia) లో ఈ నెల 20న జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రదీప్ కుమార్ పటేల్(Pradeep Kumar Patel), ఆయన కుమార్తె ఊర్మి(Urmi) లాంక్‌ఫోర్డ్ హైవేలోని తమ బంధువు పరేష్ పటేల్ (Paresh Patel) దుకాణంలో పనిచేస్తున్నారు. ఈ నెల 20న ఉదయం మద్యం కొనేందుకు దుకాణానికి వచ్చిన దుండగుడు ముందురోజు రాత్రి స్టోర్‌ను ఎందుకు మూసివేశారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే కాల్పులు జరపగా, ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఊర్మి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కాల్పులకు సంబంధించి జార్జ్ ఫ్రాజియర్ (George Frazier) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.






