Mehul Choksi: మెహుల్ ఛోక్సీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు.. ఫలితం ఉంటుందా?
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని (Mehul Choksi) తిరిగి భారత్‌కు రప్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అందుబాటులో ఉన్న ప్రతి చట్టపరమైన మార్గాన్ని అన్వేషించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, చోక్సీని (Mehul Choksi) భారత్‌కు అప్పగించకుండా ఆపేందుకు ఆయన తరఫు న్యాయవాదుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది భారత ప్రభుత్వానికి న్యాయపరమైన సవాళ్లను విసురుతోంది. అలాగే చోక్సీ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్యం క్షీణించిందని, అందువల్ల ఆయన పారిపోయే ప్రమాదం లేదని ఆయన తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించి, బెల్జియంలోనే బెయిల్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. “మా క్లయింట్ (Mehul Choksi) ఆరోగ్యం బాగాలేదు, ఆయన క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు,” అని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఇటీవలే చెప్పారు.
గతంలో ఎదురుదెబ్బ – కొత్త వ్యూహం:
చోక్సీకి వ్యతిరేకంగా 2022లో జారీ అయిన ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసును తాజాగా భారత్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. భారత్‌కు కనుక ఛోక్సీని అప్పగిస్తే తమ క్లయింట్‌పై మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ వేధింపులు జరుగుతాయంటూ ఆయన (Mehul Choksi) తరపు న్యాయవాదులు ఇంటర్‌పోల్ నియంత్రణ కమిషన్ (సీసీఎఫ్) ముందు వాదించడంతో ఆ నోటీసు రద్దయింది. ఈ పరిణామంతో భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం 2018, 2022లో జారీ చేసిన కనీసం రెండు ఓపెన్-ఎండెడ్ అరెస్ట్ వారెంట్లను సంబంధిత విదేశీ అధికారులతో పంచుకుంది. ఈ వారెంట్ల ఆధారంగానే తాజాగా బెల్జియంలో చోక్సీని (Mehul Choksi) అరెస్టు చేశారు.
అప్పగింత ప్రక్రియ ఆరంభం:
చోక్సీ అరెస్టుతో, ఆయనను భారత్‌కు అప్పగించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాల తయారీ జరుగుతోంది. అయినప్పటికీ, ఈ ప్రక్రియ న్యాయస్థానాల్లో ఎదురయ్యే వాదోపవాదాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, చోక్సీ (Mehul Choksi) ఎంత వేగంగా భారత్‌కు తిరిగి వస్తారనేది భవిష్యత్తులో జరిగే న్యాయ పోరాటాలపైనే ఆధారపడి ఉంది.







