Kulbhushan Jadhav: కుల్‌భూషణ్ అప్పీల్ విషయాన్ని స్వార్థానికి వాడుకుంటున్న పాక్
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు (Kulbhushan Jadhav) సంబంధించి 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పును పాకిస్థాన్ తన స్వార్థానికి అనుగుణంగా వాడుకుంటోంది. ఆ తీర్పులో జాదవ్‌కు అప్పీల్ చేసుకునే హక్కును స్పష్టంగా పేర్కొనలేదని పాకిస్థాన్ ప్రభుత్వం వాదిస్తోంది. 2019 జూన్‌లో ఐసీజే భారతదేశానికి అనుకూలంగా తీర్పునిస్తూ, జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ హక్కును కల్పించాలని నిర్దేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో అతనికి విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. అప్పటివరకు ఉరిశిక్షను అమలు చేయవద్దని కూడా స్పష్టం చేసింది.
అయితే, 2023 మేలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై సైనిక కోర్టులు కొందరిని దోషులుగా నిర్ధారించాయి. దీనిని సవాలు చేస్తూ దాఖలైన కేసును విచారిస్తున్న పాకిస్థాన్ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు జాదవ్ (Kulbhushan Jadhav) కేసు ప్రస్తావనకు వచ్చింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ పౌరుడు జాదవ్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అప్పీల్ హక్కును ఇవ్వగా, అల్లర్ల కేసుల్లో దోషులుగా తేలిన పాకిస్థాన్ సొంత పౌరులకు ఆ హక్కును నిరాకరించడం సరికాదని వారి తరఫు న్యాయవాది వాదించారు.దీనిపై స్పందించిన పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ న్యాయవాది, అప్పట్లో దేశ న్యాయవ్యవస్థలో ఉన్న లోపాన్ని గుర్తించి, అంతర్జాతీయ న్యాయస్థానం జాదవ్‌కు (Kulbhushan Jadhav) కాన్సులర్‌తో మాట్లాడేందుకు అనుమతిస్తూ ఆ తీర్పును ఇచ్చిందని తెలిపారు. ఆ తీర్పు వెలువడిన తర్వాత, వియన్నా ఒప్పందానికి అనుగుణంగా దేశీయ చట్టాలలో మార్పులు చేశామని ఆయన వెల్లడించారు. అయితే, ఈ మార్పులు కేవలం పునఃసమీక్షకు మాత్రమే అవకాశం కల్పిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇక 2023 అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న పౌరులకు ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునే హక్కును కల్పించే అంశంపై అటార్నీ జనరల్ మన్సూర్ ఉస్మాన్ అవాన్ అధికారులతో చర్చలు జరుపుతున్నారని కోర్టు పేర్కొంది. ఈ విషయంపై స్పష్టత ఇవ్వడానికి రెండు రోజుల సమయం కోరింది.







