Pahalgam Attack: పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలి: పహల్గాం దాడిపై అమెరికా మాజీ అధికారి
పహల్గాం ఉగ్రదాడిపై (Pahalgam Attack) ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌పై పలువురు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్‌కు, పాక్ ఆర్మీ చీఫ్‌కు తేడా లేదంటూ అమెరికా మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిన్ లాడెన్ ఒకప్పుడు చీకటి కొండల్లో దాక్కుంటే, మునీర్ ఇప్పుడు ప్యాలెస్‌లో విలాసంగా ఉంటున్నాడని, వారిద్దరి నేర స్వభావం ఒక్కటేనని ఆయన కుండబద్దలు కొట్టారు. గతంలో బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు కశ్మీర్లో ఇలాంటి దాడి జరిగిందని గుర్తు చేస్తూ.. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉండగా పహల్గాంలో ఉగ్రవాదులు (Pahalgam Attack) మారణకాండ సృష్టించడం యాదృచ్ఛికం కాదన్నారు రూబిన్. పాకిస్తాన్ ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా, ఈ దాడి వెనుక వారి హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. పహల్గాం రక్తపుటేరులకు (Pahalgam Attack) అమెరికా చేయాల్సింది ఒక్కటేనని రూబిన్ తేల్చి చెప్పారు. ‘పాకిస్తాన్‌ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలి, మునీర్‌ను ఉగ్రవాదిగా ముద్ర వేయాలి! ఈ చర్యతోనే ఉగ్రమూకలకు సరైన గుణపాఠం చెప్పగలం’ అని ఆయన గట్టిగా వాదించారు. ప్రపంచ దేశాలు కూడా ఈ విషయంలో ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దాడితో తమకు సంబంధం లేదని పాక్ చేస్తున్న వాదనలన్నీ కల్లబొల్లి మాటలేనని ఆయన తోసిపుచ్చారు.







