H-1B VISA : హెచ్-1బీ వీసాలపై అమెరికన్ కంపెనీల విముఖత

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్(Donald trump) రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సమయం ఆసన్నమైంది. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే హెచ్-1బీ వీసా (H-1B VISA) నిబంధనల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉండటంతో అమెరికన్ కంపెనీల యజమానులు, విదేశీ ఉద్యోగులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీసా నిబంధనల మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఇప్పటికే చాలా అమెరికన్ కంపెనీలు రిమోట్ ఉద్యోగులను నియమించుకుంటున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అమెరికన్ కంపెనీలు హెచ్-1బీ వీసాల జోలికి వెళ్లడం లేదని, కఠిన నిబంధనలతో పాటు ధరల పెరుగుదల, లాటరీ వ్యవస్థతో ఏర్పడిన అనిశ్చితి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ వీసాను చివరి ప్రయత్నంగా పరిగణిస్తున్నాయని డికిన్సన్ లా ఫర్మ్ భాగస్వామి కాథ్లీన్ కాంప్‌బెల్ వాకర్(Kathleen Campbell Walker) తెలిపారు.
వీసా నిబంధనలు మారడం ఖాయమని తేలడంతో ఇప్పటికే హెచ్-1బీ వీసాలు పొందిన భారతీయ ఉద్యోగులంతా (Indian employees) అమెరికాలోనే ఉండాలని వారి లాయర్లు, యజమానులు సూచిస్తున్నారు. ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల నియామకంలో పారదర్శకతను పెంపొందించేందుకు ట్రంప్ ప్రభుత్వం త్వరలో ఆధునీకరించిన హెచ్-1 బీ వీసా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.