Smart Phone: పిల్లలు ఫోన్ చూస్తే, ఎంత నష్టమో చూడండి

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది సహజంగా మారిపోయింది. ముఖ్యంగా చిన్నారులు తినాలన్నా, తాగాలన్నా సరే ఫోన్ ఇవ్వాల్సిందే అన్నట్టు పరిస్థితి మారింది. ఇది అత్యంత ప్రమాదాకరమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. స్మార్ట్ ఫోన్‌లు, టాబ్లెట్(Tablet)లు మరియు ఇతర పరికరాలపై ఎక్కువ సమయం గడపడం వల్ల పసిపిల్లలలో ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కెనడా(Canada)లోని ది హాస్పిటల్ ఫర్ సిక్ చిల్డ్రన్ పరిశోధకులు నాలుగేళ్ల పాటు టొరంటోలో ప్రాక్టీస్-ఆధారిత పరిశోధనలో ఆసక్తికర విషయాలను గుర్తించింది.
ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల మధ్య వయస్సు గల 894 మంది పిల్లలను అధ్యయనం చేసింది. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడే పిల్లలు, మాట్లాడటం ఆలస్యం అవుతోందని, వారికి జ్ఞాపక శక్తి పడిపోతోందని గుర్తించారు. స్మార్ట్ ఫోన్ పైనే ఎక్కువ సమయం గడపడం కారణంగా కుటుంబ సభ్యులను కూడా కొంత కాలానికి మర్చిపోయే ప్రమాదంలో పడుతున్నట్టు గుర్తించారు. అలాగే శారీరక వ్యాయామం తగ్గడం కారణంగా పిల్లల్లో ఊభాకాయం సమస్యలు తలెత్తుతున్నాయని, అలాగే కంటిపై, మెదడులోని నరాలపై తీవ్ర ప్రభావం పడుతునట్టు తేల్చారు.
తమ భావాలను వ్యక్తం చేయడంలో ఆలస్యం జరుగుతోందని గుర్తించారు. హ్యాండ్ హెల్డ్ స్క్రీన్ సమయంలో ప్రతి 30 నిమిషాల పెరుగుదలకు, భావ వ్యక్తీకరణ ఆలస్యం ప్రమాదం 49 శాతం పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. వీటి కారణంగా సమాజంలో కలవడం కూడా ఇబ్బందికరంగా మారినట్టు తెలిపారు. బాడీ లాంగ్వేజ్ లేదా హావభావాలు వంటి ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడుతున్నట్టు గుర్తించారు. 18 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రభావాలు అత్యంత తీవ్రంగా ఉన్నట్టు గుర్తించారు. తల్లి తండ్రులతో కూడా గడప లేకపోతున్నారని, ఏదైనా ఒక విషయాన్ని అర్ధం చేసుకునే సామర్ధ్యం కూడా పడిపోతుందని గుర్తించారు.