Speaker – High Court: జగన్‌కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించగలదా…?

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా (opposition status) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) పట్టుబడుతున్నారు. ఆ హోదా ఇచ్చేవరకూ అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే సస్పెన్షన్ విధించుకోవాలని సవాల్ విసిరారు. అంతేకాక, ప్రతిపక్ష హోదాకోసం న్యాయపోరాటం చేస్తున్నారు. గతేడాదే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జగన్, తాజాగా మరోసారి హైకోర్టులో (AP High Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఏదైనా అంశంపై అసెంబ్లీ స్పీకర్ ను హైకోర్టు ఆదేశించగలదా.. అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం.
అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, గవర్నర్, రాష్ట్రపతి లాంటివి రాజ్యాంగబద్ధ పదవులు. న్యాయస్థానాలకు ఎలాంటి విచక్షణాధికారం ఉంటుందో ఈ స్థానాల్లో ఉన్న వాళ్లకు కూడా అంతే పవర్స్ ఉంటాయి. అందుకే వీళ్లను చట్టసభలు, న్యాయస్థానాలు ఆదేశించలేవు. అయితే కొన్ని అంశాల్లో మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోగలవు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్లను పరిశీలించాలని మాత్రమే సూచించగలవు. అంతేకానీ వాళ్లకు ఆదేశించేందుకు న్యాయస్థానాలు సుముఖంగా ఉండవు. మెజారిటీ సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు.
జగన్ కు ప్రతిపక్ష హోదా అంశంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇప్పటికే రూలింగ్ ఇచ్చారు. చట్టసభల్లో ఏదైనా పార్టీని గుర్తించాలంటే మొత్తం సీట్లలో కనీసం 10శాతం సీట్లు ఉండాలని మొదటి పార్లమెంటు సమావేశాల్లో అప్పటి స్పీకర్ మౌలాంకర్ రూలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి కనీసం 10 శాతం సీట్లు ఉంటే వాళ్లను ఆయా పార్టీల సభ్యులుగా, దాన్ని ఒక పార్టీగా గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో మొత్తం సీట్లు 175. ఇందులో 10 శాతం అంటే కనీసం 18 సీట్లు వస్తేనే రాజకీయ పార్టీగా గుర్తించేందుకు వీలుంటుంది. కానీ వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి దాన్ని పార్టీగా గుర్తించేందుకు వీలుండదు. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ప్రస్తావనే తెరపైకి రాదనేది విశ్లేషకులు చెప్తున్న మాట.
వైసీపీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నామో ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివరించారు. అయినా జగన్ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. దీనిపై స్పీకర్, స్పీకర్ సెక్రటరీ, అసెంబ్లీ వ్యవహారాల మంత్రికి హైకోర్టు అఫిడవిట్లు దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. దీనిపై వీళ్లు అఫిడవిట్లు సమర్పిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు తన తుది నిర్ణయం చెప్పే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 4 న తదుపరి విచారణ ఉంది.
అయితే స్పీకర్ నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవనే విషయం మనకు తెలుసు. అందుకే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని హైకోర్టు స్పీకర్ ను ఆదేశించలేదు. అయితే పరిశీలించాలని స్పీకర్ కు సూచించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా 10శాతం సీట్లు లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉంటే దాన్ని కోట్ చేయవచ్చు. అయినా స్పీకర్ దే తుది నిర్ణయం అని హైకోర్టు చెప్పే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ స్పీకర్ అఫిడవిట్ తో హైకోర్టు సంతృప్తి చెందితే జగన్ పిటిషన్ ను కొట్టేయవచ్చు. అంతేకానీ జగన్ కోరుకున్నట్టు ప్రతిపక్ష హోదా అనేది హైకోర్టు ఆదేశాలతో రాదు.. అది పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారం. కాబట్టి హైకోర్టులో జగన్ కోరిక నెరవేరకపోవచ్చు.